ICC Rankings: టీమిండియా అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకులలో అగ్రశ్రేణి జట్లుగా గుర్తింపు పొందిన టీమ్స్‌కు కూడా సాధ్యం కాని రీతిలో అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ టీమ్‌గా ఎదిగింది. వన్డేలు, టెస్టులు, టీ20 ఫార్మాట్లలో భారత్ మొదటి స్థానాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర లిఖించింది. సుమారు 11 ఏండ్ల తర్వత ఒక జట్టు అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకోవడం ఇదే ప్రథమం. అంతకుముందు 2012లో సౌతాఫ్రికా ఈ ఘనత దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది. భారత్‌కు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మూడింటిలోనూ మనమే టాప్..
ఆస్ట్రేలియాతో శుక్రవారం మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో గెలిచిన తర్వాత భారత్.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్‌కు కిందికి దించి తొలి స్థానానికి ఎగబాకింది. తద్వారా ఇదివరకే టెస్టులు, టీ20లలో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న భారత్ మూడు ఫార్మాట్లలోనూ తొలి స్థానం దక్కించుకున్న టీమ్‌గా నిలిచింది.
- వన్డేలలో భారత్ 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా పాకిస్తాన్ (115), ఆస్ట్రేలియా (111), సౌతాఫ్రికా (106), ఇంగ్లాండ్ (105)లు టాప్ -5లో ఉన్నాయి.
- టెస్టులలో రోహిత్ సేన 118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వా ఆస్ట్రేలియా (118), ఇంగ్లాండ్ (115), సౌతాఫ్రికా (104), న్యూజిలాండ్ (100) లు టాప్ - 5 లో నిలిచాయి.
- టీ20లలో టీమిండియా 264 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లాండ్ (261), పాకిస్తాన్ (254), న్యూజిలాండ్ (254), సౌతాఫ్రికా (250)లు టాప్ - 5లో స్థానం దక్కించుకున్నాయి.
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో కూడా భారత్ గెలిస్తే నెంబర్ వన్ టీమ్‌గా వరల్డ్ కప్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడితే పాకిస్తాన్ తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటుంది. ఈ సిరీస్ ను 2-1 తేడాతో ఓడిస్తే భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది.
అన్నింటా ఆధిపత్యం మనదే..
టీమ్ ర్యాంకింగ్స్‌లోనే కాదు ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకులలోనూ భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. టీ20లలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. వన్డేలలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానం (బాబర్ ఆజమ్ ఫస్ట్ ప్లేస్)లో ఉండగా విరాట్ కోహ్లీ (8), రోహిత్ శర్మ (10) కూడా టాప్ -10లో ఉన్నారు. వన్డే బౌలర్ల జాబితాలో హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. టెస్టులలో నెంబర్ వన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కాగా జడేజా (3), జస్ప్రిత్ బుమ్రా (10) లు టాప్ - 10లో ఉన్నారు. టెస్టు ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా అశ్విన్ (2), అక్షర్ పటేల్ (6) కూడా మెరుగైన ర్యాంకులతోనే ఉన్నారు.