ICC T20 World 2022 WI vs IRE Match Highlights:  ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. రెండుసార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌కు గర్వభంగం కలిగింది. మెగా టోర్నీ నుంచి ఆ జట్టు అవమానకరంగా నిష్క్రమించింది. భారీ హిట్టర్లున్నా ఫస్ట్‌రౌండ్‌ సైతం దాటకుండానే ఇంటి ముఖం పట్టింది. మరోవైపు ఐర్లాండ్‌ సూపర్‌ 12కు దూసుకెళ్లింది.




హోబర్ట్‌ వేదికగా జరిగిన పోరులో కరీబియన్లపై 9 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. 147 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులుండగానే ఛేదించింది. పాల్‌ స్టిర్లింగ్‌ (66*; 48 బంతుల్లో 6x4, 2x6), లార్కన్‌ టకర్‌ (45*; 35 బంతుల్లో 2x4, 2x6), ఆండీ బాల్‌బిర్నీ (37; 23 బంతుల్లో 3x4, 3x6)  బ్యాటింగ్‌లో అదరగొట్టారు. అంతకు ముందు విండీస్‌లో బ్రాండన్‌ కింగ్‌ (62*; 48 బంతుల్లో 6x4, 1x6) హాఫ్‌ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు.


విండీస్‌ దారుణం!


తప్పక గెలవాల్సిన మ్యాచులో విండీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. జట్టు స్కోరు 10 వద్దే ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (1) వికెట్‌ చేజార్చుకుంది. 27 వద్ద జాన్సన్‌ చార్లెస్‌ (24) ఔటయ్యాడు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి విండీస్‌ 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఎవిన్‌ లూయిస్‌ (13)తో కలిసి బ్రాండన్‌ కింగ్‌ రెచ్చిపోయాడు. ఒకవైపు సమయోచితంగా ఆడుతూ షాట్లు కొట్టాడు. కీలక సమయంలో కరీబియన్లను డెలానీ దెబ్బకొట్టాడు. లూయిస్‌, పూరన్‌ (13), పావెల్‌ (6)ను ఔట్‌ చేసి మిడిలార్డర్‌ను కుదేలు చేశాడు. ఆఖర్లో ఒడీన్‌ స్మిత్‌ (19*) ప్రతిఘటించినా విండీస్‌ 146/5తో నిలిచింది.


టాప్‌ 3 దూకుడు


మరీ ఎక్కువ టార్గెట్‌ ఏమీ లేకపోవడంతో ఐర్లాండ్‌ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌, ఆండీ బాల్‌బిర్నే దంచికొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. ఓపెనర్లద్దరూ పోటీపడి మరీ కొట్టారు. జట్టు స్కోరు 73 వద్ద బాల్‌బిర్నేను హుస్సేన్‌ ఔట్‌ చేశాడు. దీంతో వన్‌డౌన్‌లో వచ్చిన లార్కన్‌ టకర్‌తో కలిసి స్టిర్లింగ్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. విండీస్‌ బౌలర్లపై ధాటిగానే ఆడాడు. వీరిద్దరూ  రెండో వికెట్‌కు 61 బంతుల్లో 77 పరుగుల అజేయభాగస్వామ్యం నెలకొల్పి జట్టును సూపర్‌ 12కు చేర్చారు.