T20 World Cup 2022: టీమ్‌ఇండియా 2011 తర్వాత ప్రపంచకప్‌లు గెలవకపోవడానికి స్వామిభక్తే కారణమని గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. పెద్ద టోర్నీల్లో భారత్‌ విఫలమవ్వడానికి ఇదే అతిపెద్ద కారణమని వెల్లడించాడు. జట్టంతా ఆడితే ఒక్కరే గెలిపించినట్టు క్రెడిట్‌ ఇచ్చేస్తున్నారని విమర్శించాడు. ఆటగాళ్లకు మీడియా ఎక్కువ హైప్‌ ఇవ్వడం మరో కారణమన్నాడు. ఇతర దేశాలతో పోలిస్తే ఉపఖండంలో ఇదో సామాన్య విషయంగా మారిపోయిందని స్పష్టం చేశాడు.


సూర్య గురించి చెప్పరేం?


'మనం క్రికెట్‌ గురించి ఎక్కువ మాట్లాడాలి. భారత క్రికెట్‌ జట్టు గురించి మాట్లాడటం ముఖ్యం. స్వామిభక్తి కాదు. గతేడాది టీమ్‌ఇండియా టాప్‌-6 బ్యాటర్లకన్నా సూర్యకుమార్‌ యాదవ్‌ ఎక్కువ రాణించాడు. మనం అతడి గురించి ఎక్కువగా మాట్లాడం. ఎందుకంటే సోషల్‌ మీడియాలో అతడికి తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు' అని గంభీర్‌ అన్నాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో కెప్టెన్‌ ఒక్కడే పోటీపడడని, జట్టంతా సమష్టిగా కష్టపడుతుందని వెల్లడించాడు.




అందరూ ఆడారు!


'దురదృష్టశాత్తు భారత్‌లో ఒకటి జరుగుతోంది. ఒకవేళ టీమ్‌ఇండియా ఈ ప్రపంచకప్ గెలిస్తే మొత్తం క్రెడిట్‌ రోహిత్‌ శర్మకు పోతుంది. హిట్‌మ్యాన్‌ ఒక్కడే ప్రపంచకప్‌ గెలవడు. ఇండియా గెలుస్తుంది' అని గౌతీ అన్నాడు. 'మనం 2007, 2011లో ప్రపంచకప్‌లు గెలిస్తే ఎంఎస్ ధోనీ గెలిపించాడని అన్నాం. 83లో గెలిస్తే కపిల్‌ దేవ్‌ గెలిచాడని చెప్పాం. నిజానికి గెలిచింది భారత్‌. ఎందుకంటే మిగతా ఆటగాళ్లూ క్యాచులు అందుకున్నారు, బంతులు వేశారు, పరుగులు చేశారు' అని గంభీర్‌ ఘాటుగా చెప్పాడు.


ప్రతీకారం కోసం పట్టుదల


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం వేదికగా ఆదివారం పాకిస్థాన్‌తో తలపడనుంది. మెగా టోర్నీలో దాయాది జట్లకు ఇదే తొలి మ్యాచ్‌. ఇందులో గెలిచేందుకు రెండు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గతేడాది ఓటమికి పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. కీలకమైన ఈ పోరుకు ముందు ఆటగాళ్లంతా ప్రశాంతంగా ఉంటామని వెల్లడించాడు.


బ్లాక్‌ బస్టరే


'మేం ఎప్పుడు పాకిస్థాన్‌తో ఆడినా బ్లాక్‌బస్టరే అవుతుంది. జనాలు బయటకు వచ్చి మ్యాచ్‌ను వీక్షిస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. అలాగే క్రికెట్‌ను ఎంజాయ్‌ చేస్తారు. అయితే స్టేడియంలో ఎలాంటి ఉత్సాహం, థ్రిల్‌ ఉంటుందో తెలిసిందే. ఆటగాళ్లకూ ఇదో గొప్ప మ్యాచ్‌. పాక్‌ పోరుతో మేం క్యాంపెయిన్‌ ఆరంభిస్తున్నాం. అదే సమయంలో మేం ప్రశాంతంగా ఉంటాం. అలా ఉంటేనే మేం కోరుకున్న ఫలితం వస్తుంది' అని రోహిత్‌ చెప్పాడు.