Sri Lanka into Super 12s: ఆసియాకప్‌ విజేత శ్రీలంక ఊపిరి పీల్చుకుంది! ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్ 12కు అర్హత సాధించింది. గీలాంగ్స్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఫస్ట్‌రౌండ్‌ పోరులో విజయం అందుకుంది. కఠిన పిచ్‌పై 163 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ను 16 పరుగుల తేడాతో ఓడించింది. 146/9కి పరిమితం చేసింది. వనిందు హసరంగ (3-28), మహీశ్‌ థీక్షణ (2-32) బంతితో విజృంభించడంతో మాక్స్‌ ఓడౌడ్‌ (71*; 53 బంతుల్లో 6x4, 3x6) ఒంటరి పోరాటం వృథా అయింది. అంతకు ముందు లంకలో కుశాల్‌ మెండిస్ (79; 44 బంతుల్లో 5x4, 5x6) దుమ్మురేపాడు. యూఏఈపై నమీబియా గెలుపును బట్టి శ్రీలంక ఏ గ్రూపులో చేరుతుందో తెలుస్తుంది.




మెండిస్‌ వీర విహారం


పిచ్‌ స్లగ్గిష్‌గా ఉండటంతో టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. జట్టు స్కోరు 36 వద్ద వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మీకెరెన్‌ వేసిన 6.3వ బంతికి పాథుమ్‌ నిసాంక (14) బౌల్డ్‌ అయ్యాడు. తర్వాతి బంతికే ధనంజయ డిసిల్వా (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఈ సిచ్యువేషన్లో చరిత్‌ అసలంక (30; 30 బంతుల్లో 3x4) కుశాల్‌మెండిస్‌ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మూడో వికెట్‌కు 45 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం అందించాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లు లెగ్‌సైడ్‌ బంతులు వేయడంతో పండగ చేసుకున్నాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగాడు. 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. జట్టు స్కోరు 96 వద్ద అసలంకను  డిలీడ్‌ ఔట్‌ చేశాడు. దాంతో రాజపక్సతో నాలుగో వికెట్‌కు 19 బంతుల్లో 34, శనకతో కలిసి 8 బంతుల్లో 21 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు మెండిస్‌. ఆఖరి ఓవర్‌ రెండో బంతికి అతడిని గుగ్టెన్‌ ఔట్‌ చేసినా అప్పటికే లంక పటిష్ఠమైన స్థితిలో నిలిచింది.




మాక్స్‌ ఒంటరి పోరాటం


సూపర్‌ 12 చేరాలంటే గెలవాల్సిన మ్యాచులో నెదర్లాండ్స్‌ తడబడింది. లంక బౌలర్లు మహీశ్‌ థీక్షణ, వనిందు హసరంగ బంతితో చుక్కలు చూపించారు. సగటున 15 పరుగులకో వికెట్‌ చొప్పున పడగొట్టారు. జట్టు స్కోరు 23 వద్ద విక్రమ్‌జీత్‌ (7)ను థీక్షణ ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో మాక్స్‌ ఓ డౌడ్‌తో కలిసి బస్‌ డిలీడ్‌ (14) కాసేపు నిలిచాడు. 5.6వ బంతిని అతడిని లాహిరు కుమార ఔట్‌ చేయడంతో నెదర్లాండ్స్‌ పతనం ఆరంభమైంది. వరుసగా వికెట్లు కోల్పోయింది. మాక్స్‌కు ఎవరూ అండగా నిలవలేదు. మిడిలార్డర్లో టామ్‌ కూపర్(16), స్కాట్‌ ఎడ్‌వర్డ్స్‌ (21) నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించినా లంక బౌలర్లు నిలువరించారు. మరోవైపు వికెట్లు పడుతున్నా మాక్స్‌ ఒంటరి పోరాటం చేశాడు. సిక్సర్లు, బౌండరీలు బాదుతూ బెంబేలెత్తించాడు. జట్టు స్కోరును 146/9 వరకు తీసుకొచ్చాడు.