ICC T20 WC 2022, IRE vs NZ: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2022లో న్యూజిలాండ్ దాదాపుగా సెమీస్‌కు దూసుకుపోయింది! అడిలైడ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 150/9కే నిలువరించింది. ఐర్లాండ్‌లో పాల్‌ స్టిర్లింగ్‌ (37), ఆండీ బాల్‌బిర్నే (30) టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు కివీస్‌లో కేన్‌ విలియమ్సన్‌ (61; 35 బంతుల్లో 5x4, 3x6) ఫామ్‌లోకి వచ్చాడు. ఈ విజయంతో న్యూజిలాండ్‌ 7 పాయింట్లు, 2.113 రన్‌రేట్‌తో గ్రూప్‌ 1లో అగ్రస్థానంలో నిలిచింది. టెక్నికల్‌గా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా రెండో స్థానం కోసమే పోటీ పడాల్సి ఉంది!


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు ఫిన్‌ అఎన్ (32) డేవాన్‌ కాన్వే (28) దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం అందించారు. అలెన్‌ను ఔట్‌ చేయడం ద్వారా అడైర్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కేన్‌ విలియమ్సన్‌ (61)  ఈసారి రెచ్చిపోయాడు. 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. మిడిలార్డర్లో డరైల్‌ మిచెల్‌ (31*) సైతం విధ్వంసకరంగానే ఆడటంతో న్యూజిలాండ్‌ 185/6తో నిలిచింది. కేన్‌, జిమ్మీ నీషమ్‌, శాంట్నర్‌ను వరుస బంతుల్లో ఔట్‌చేసిన జోష్ లిటిల్‌ హ్యాట్రిక్‌ అందుకున్నాడు. ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ మొదట బాగానే ఆడింది. ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌ (37), బాల్‌బిర్నే (30) వేగంగా ఆడారు. వీరిద్దరూ ఔటయ్యాక ఆ జట్టు డీలా పడింది. ఫెర్గూసన్‌, (3), సౌథీ, శాంట్నర్‌, సోధి తలో రెండు వికెట్లు పడగొట్టడంతో ఐర్లాండ్‌ 150/9కి పరిమితమైంది.