ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సూపర్ 12 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ‘ఫేక్ ఫీల్డింగ్’ చేశాడని బంగ్లా వికెట్ కీపర్ బ్యాటర్ నూరుల్ హసన్ ఆరోపించడం భారీ వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా వర్షం అంతరాయం కలిగించిన తర్వాత ఆటను తిరిగి ప్రారంభించే ముందు అంపైర్‌లతో తీవ్ర సంభాషణలో పాల్గొన్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) 'వివాదాస్పద అంపైరింగ్' విషయాన్ని సరైన వేదికపై లేవనెత్తాలని నిర్ణయించింది.


బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ మాట్లాడుతూ షకీబ్ కూడా 'ఫేక్ ఫీల్డింగ్' విషయాన్ని అంపైర్‌లతో మాట్లాడాడని, కానీ వారు దాన్ని అంతగా పట్టించుకోలేదని చెప్పాడు.


"మేం దాని గురించి మాట్లాడాం. మీరు దానిని టీవీలో చూశారు. అది మీ ముందే జరిగింది. ఫేక్ త్రో గురించి అంపైర్‌లకు తెలియజేశాం. కాని అతను దానిని గమనించలేదని చెప్పాడు. అంపైర్ ఎరాస్మస్‌తో షకీబ్ అల్ హసన్ దాని గురించి చాలా చర్చించాడు. ఆట తర్వాత అతనితో కూడా మాట్లాడాడు.” అని జలాల్ తెలిపారు.


వర్షం అంతరాయం తర్వాత అవుట్‌ఫీల్డ్ ఇంకా తడిగా ఉన్నందున కొంచెం ఆలస్యంగా ఆట ప్రారంభించమని షకీబ్ అంపైర్‌లను అభ్యర్థించాడని జలాల్ చెప్పాడు. కానీ వారి అభ్యర్థనను అంపైర్లు తిరస్కరించారు.


"షకీబ్ తడి మైదానం గురించి మాట్లాడాడు. మైదానం ఎండిన తర్వాత ఆట ప్రారంభించవచ్చని అతను కోరాడు. అయితే అంపైర్ల నిర్ణయమే ఫైనల్. అక్కడ వాదనకు తావు లేదు, మీరు ఆడాలా వద్దా అన్నది పూర్తిగా అంపైర్ల నిర్ణయం." అని అతను చెప్పాడు.


బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ ఆందోళనను సరైన వేదికపై లేవనెత్తాలని భావిస్తున్నట్లు జలాల్ ఇప్పుడు ధృవీకరించారు. "మేం దాన్ని మెదళ్లలో పెట్టుకున్నాం. తద్వారా సమస్యను సరైన ఫోరమ్‌లో లేవనెత్తవచ్చు" అని ఆయన నొక్కి చెప్పారు.