Cricket Balls: క్రికెట్ ఆట అంటే తెలియని వారుండరు. ఇప్పుడు మారుమూల పల్లెల్లోనూ పిల్లలు తమకు తోచిన విధంగా ఈ ఆట ఆడుతుంటారు. స్థూలంగా చెప్పాలంటే క్రిెకెట్ అంటే బ్యాటుతో బంతిని కొట్టడం. చిన్నపిల్లలు రబ్బరు బంతితో, పెద్దవారు టెన్నిస్ బంతులతో క్రికెట్ ఆడడం సాధారణం. అయితే అంతర్జాతీయ మ్యాచుల్లో క్రికెట్ ఆడటానికి ఎలాంటి బంతి ఉపయోగిస్తారు? ఎన్ని రకాల బంతులు వాడతారు? వాటిని ఎలా తయారు చేస్తారు? వీటికి సమాధానాలు తెలుసుకుందాం పదండి. 


అంతర్జాతీయ క్రికెట్ లో కార్క్ బంతిని ఉపయోగిస్తారు. వీటిని తోలుతో కప్పబడిన కార్క్ బాడీతో తయారు చేస్తారు. ఈ తోలు రెండు లేదా నాలుగు వరుసల్లో ఉంటుంది. వాటిని ఆరు వరుసల కుట్లతో కుడతారు. ఆ కుట్లనే సీమ్ అంటారు. క్రికెట్ బంతులు దాదాపు 23 సెం.మీ వ్యాసం, 160 నుంచి 163 గ్రాముల బరువు ఉంటాయి. మహిళల క్రికెట్ లో ఈ పరిమాణాలు కొంచెం తక్కువగా ఉంటాయి. 


క్రికెట్ ఆటతో పాటు బంతులు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ప్రస్తుతం మూడు రకాల బంతులను క్రికెట్ ఆడేందుకు ఉపయోగిస్తున్నారు. అవేంటో చూద్దాం. 


రెడ్ బాల్ 


అసలు క్రికెట్ బంతి ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని టెస్ట్ మ్యాచులు, దేశవాళీ టోర్నీల్లో ఉపయోగిస్తారు. దీన్ని చేతితోను లేదా యంత్రంతోనూ తయారుచేస్తారు. ఇది అధిక దృఢత్వంతో ఉంటుంది. టెస్ట్ ఫార్మాట్లో రోజుకు 80 నుంచి 90 ఓవర్లు ఆడతారు. అందుకు అనుగుణంగా చాలా దృఢంగా ఉండేలా అత్యున్నత మన్నికతో రెడ్ బాల్ ను తయారుచేస్తారు. ఆట సాగేకొద్దీ బంతి అరుగుతుంది. అలాంటప్పుడు బౌలర్లు దాన్ని అంతగా స్వింగ్ చేయలేరు. 


వైట్ బాల్


కలర్ టెలివిజన్ లో క్రికెట్ ప్రసారం పెట్టడం, ఒక రోజు (వన్డే) క్రికెట్ ఫార్మాట్ రావటం వైట్ బాల్ తయారీకి దారితీసింది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎర్ర బంతి పిచ్ రంగుకు దగ్గరగా ఉండడం వలన కనిపించదు. కాబట్టి తెలుపు రంగు బంతిని తయారు చేశారు. రెడ్ బాల్ తో పోలిస్తే వైట్ బాల్ నాణ్యత, మన్నిక తక్కువగా ఉంటుంది. బంతిని కుట్టిన ప్రాంతాన్ని సీమ్ అంటారు. ఎరుపు బంతితో పోలిస్తే తెలుపు బంతి కొన్ని సందర్భాల్లో వెడల్పు ఎక్కువగా ఉంటుంది. టీ20 ఫార్మాట్ లోనూ తెలుపు రంగు బంతినే వాడతారు. 


పింక్ బాల్


టెస్ట్ క్రికెట్ లో డే-నైట్ ఫార్మాట్ ప్రవేశపెట్టినప్పుడు పింక్ బాల్ ను తీసుకువచ్చారు. రాత్రి వేళ ఎరుపు బంతి అంతగా కనిపించదు. తెల్ల బంతి నాణ్యత తక్కువగా ఉండడం వల్ల ఈ ఫార్మాట్ కు పనికిరాదు. కాబట్టి పింక్ బంతిని ప్రవేశపెట్టారు. ఎరుపు, తెలుపు రంగుల కన్నా పింక్ కలర్ ఎక్కువ స్థిరత్వంతో ఉంటుంది. రాత్రివేళ బాగా కనిపిస్తుంది.  


క్రికెట్ బంతులను మూడు ప్రధాన కంపెనీలు తయారుచేస్తాయి. డ్యూక్స్, కూకబుర్రా, ఎస్జీ. డ్యూక్స్‌ని ఇంగ్లండ్, వెస్టిండీస్.. కూకబుర్రను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక.. SGని భారతదేశం ఎక్కువగా ఉపయోగిస్తుంది.