ICC responds after alleged terror threat to T20 World Cup: జూన్ 1 నుంచి అమెరికా-వెస్టిండీస్ కలిసి నిర్వహిస్తున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీకి ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఉత్తర పాకిస్థాన్ లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వచ్చినట్టు వెస్టిండీస్ లోని ఓ దేశమైన ట్రినిడాడ్ అండ్ టుబాగో ప్రధాని కీత్ రౌలే వెల్లడించారు. ఉగ్రమూకలు ఎలాంటి దాడులకైనా పాల్పడే ప్రమాదం ఉందని, వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. టోర్నీ ఆసాంతం మ్యాచ్ లు జరిగే వేదికలు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఇప్పటికే.. తమ దేశ ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు కీత్ రౌలే స్పష్టం చేశారు. ఈ పరిస్థితులను గమనిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి-ICCఆతిథ్య దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించింది.
పటిష్ట భద్రత: ఐసీసీ
2024 టీ20 ప్రపంచకప్‌నకు తీవ్రవాద బెదిరింపులు వచ్చిన తర్వాత భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ఆతిథ్య దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 కోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని, మరింత భద్రత ఏర్పాటు చేసేందుకు ఆతిథ్య దేశాలతో కలిసి చురుగ్గా పనిచేస్తున్నామని ఐసీసీ తెలిపింది. తీవ్రవాద ముప్పు గురించి నివేదికలు వచ్చిన తర్వాత ఐసీసీ అధికారులు తక్షణం స్పందించారని వెల్లడించింది. ప్రపంచకప్‌నకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాన మంత్రి కీత్ రౌలీ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా టీ 20 ప్రపంచకప్ నిర్వహించేందుకు సమగ్ర భద్రతా ప్రణాళిక ఉందని క్రికెట్ వెస్టిండీస్ ప్రతి ఒక్కరికీ హామీ ఇచ్చిందని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు.
ఆరంభం అప్పుడే..
జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.
అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది.
టీ 20 ప్రపంచకప్‌లో టీం ఇండియా షెడ్యూల్
ఇండియా vs ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)