MI vs SRH IPL 2024 Mumbai Indians won by 7 wkts: టీ 20 ప్రపంచకప్ (T20 World Cup)ముందు విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) జోరు అందుకున్నాడు. హైదరాబాద్(SRH)తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసంకర శతకంతో ముంబై(MI)కి సునాయస విజయం అందించాడు. హైదరాబాద్ బౌలర్లను తేలిగ్గా ఎదుర్కొన్న సూర్య 51 బంతుల్లోనే 102 పరుగులు చేసి శతక గర్జన చేయడంతో హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు దాదాపుగా దూరమైన ముంబై... ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకుంది. ఈ ఓటమితో హైదరాబాద్ ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సూర్యకుమార్ యాదవ్ అద్భుత శతకంతో సునాసయ విజయం సాధించింది.
IPL 2024: సూర్యకుమార్ శతక గర్జన, SRHపై ముంబై ఘన విజయం
ABP Desam
Updated at:
06 May 2024 11:31 PM (IST)
Edited By: Jyotsna
IPL 2024, MI vs SRH: టీ 20 ప్రపంచకప్ ముందు విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ జోరు అందుకున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసంకర శతకంతో ముంబైకి సునాయస విజయం అందించాడు.
సూర్యకుమార్ యాదవ్ శతకం, హైదరాబాద్‌పై ముంబయి విజయం( Image Source : Twitter )
NEXT
PREV
ఆరంభంలో పర్వాలేదనిపించినా...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రానిస్ హెడ్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి మంచి పునాదే వేశారు. కానీ అభిషేక్ శర్మ అవుటైన తర్వాత హైదరాబాద్ వికెట్ల పతనం ప్రారంభమైంది. 16 బంతుల్లో 11 పరుగులు చేసిన అభిషేక్ శర్మను బుమ్రా అవుట్ చేసి హైదారాబాద్‌కు తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే మయాంక్ అగర్వాల్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఆరు బంతుల్లో అయిదు పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను కంబోజ్ బౌల్డ్ చేశాడు. దీంతో 68 పరుగులకే హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగింది. ట్రానిస్‌హెడ్‌తో జత కలిసిన నితీశ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కానీ ట్రానిస్ హెడ్‌ను అవుట్ చేసిన అమిత్ మిశ్రా హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పదో ఓవర్‌లో 30 బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్‌తో ట్రానిస్ హెడ్ 48 పరుగులు చేసి అవుటయ్యాడు. హైదరాబాద్ బ్యాటర్లలో ట్రానిస్ హెడ్‌దే అత్యధిక స్కోరు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న హెన్రిచ్ క్లాసెన్ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరి తీవ్ర నిరాశకు గురి చేశాడు. నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసిన క్లాసెన్‌ను పియూష్ చావ్లా అవుట్ చేశాడు. మార్కో జాన్సన్ 12 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటవ్వగా... షెహబాజ్ అహ్మద్ 12 బంతుల్లో 10 పరుగులు చేసి అవుటయ్యాడు. అబ్దుల్ సమద్ నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పాట్ కమిన్స్ 17 బంతుల్లో 35 పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
సూర్యా ధనాధన్
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు శుభారంభం దక్కలేదు. 26 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. కేవలం 9 పరుగులే చేసి కిషన్ అవుటవ్వగా నాలుగు పరుగులే చేసి రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ముంబై 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. నమన్ ధీర్ తొమ్మిది బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండా అవుట్యయాడు. ఆ తర్వాత సూర్య విధ్వంసం ఆరంభమైంది. మెరుపు బ్యాటింగ్ చేసిన సూర్య... హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 30 బంతుల్లోనే సూర్య అర్ధ శతకం చేశాడు. అనంతరం మరో 21 బంతుల్లోనే శతకం సాధించాడు. 51 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో సూర్య శతకం చేశాడు. తిలక్ వర్మ కూడా 37 పరుగులతో రాణించాడు. వీరిద్దరి విధ్వంసంతో మరో వికెట్ పడకుండా మరో 16 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం సాధించింది.
Published at:
06 May 2024 11:31 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -