భారత్‌(Bharat) వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World Cup) ముగిసింది. సెమీస్ వరకు అద్భుతంగా ఆడిన టీమిండియా(Team India) ఫైనల్లో ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) గెలవడానికి వాళ్ల ఫీల్డింగ్‌ కూడా ఓ కారణమని క్రీడా నిపుణులు అంచనా వేశారు. అయితే  భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అద్భుత ఫీల్డర్లు ఎవరో... అద్భుతంగా ఫీల్డింగ్‌ చేసిన జట్టేదో ఐసీసీ ప్రకటించేసింది. అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. 10 మంది అత్యుత్తమ ఫీల్డర్లను ఎంపికం చేసింది. అత్యుత్తమ ఫీల్డర్ల జాబితాలో ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టీమిండియా... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ ఆటగాళ్లకు కూడా ఉత్తమ ఫీల్డర్ల జాబితాలో స్థానం దక్కింది. ఇంతకీ ఆ పది మంది ఎవరెవరంటే....

 

టాప్‌ టెన్ బెస్ట్‌ ఫీల్డర్స్..

1) నెంబర్‌ వన్‌... మార్నస్ లబుషేన్‌. ఆస్ట్రేలియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అత్యుత్తమ ఫీల్డర్‌ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఫైనల్‌ సహా చాలా మ్యాచుల్లో లబుషేన్‌ అత్యుత్తమంగా ఫీల్డింగ్‌ చేశాడు. 82.66 రేటింగ్‌ పాయింట్లతో లబుషేన్‌ అత్యుత్తమ ఫీల్డర్‌గా ఎంపికయ్యాడు. 

 

2) మైదానంలో చిరుతపులిలా కదిలే మరో ఆస్టేలియన్‌ ఫీల్డర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 82.55 రేటింగ్‌ పాయింట్లతో ఈ ఆస్ట్రేలియా ఓపెనర్‌ అత్యుత్తమ ఫీల్డర్ల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్నాడు.

 

3) సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 79.48 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు.

 

4) మైదానంలో పాదరసంలా కదిలే టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బెస్ట్‌ ఫీల్డర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 72.72 రేటింగ్‌ పాయింట్లతో జడేజా నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో జడేజా ఎన్నో మంచి క్యాచులను తీసుకున్నాడు.

 

5)  నెదర్లాండ్స్‌ ఫీల్డర్‌ సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 58.72 రేటింగ్‌ పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచాడు. పసికూన జట్టైనా నెదర్లాండ్స్‌ ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిందంటే దానికి ఫీల్డింగ్‌ కూడా ఓ కారణం.

 

6) మైదానంలో హైపర్‌ యాక్టివ్‌గా ఉండే టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్, రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ అత్యుత్తమ ఫీల్డర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. 56.79 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు.

 

7)  దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్‌ ఐడెన్ మార్‌క్రమ్ 50.85 రేటింగ్‌ పాయింట్లతో బెస్ట్‌ ఫీల్డర్‌ జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు.

 

8)  న్యూజిలాండ్‌ స్టార్‌ స్పిన్నర్‌ మిచెల్ శాంట్నర్.. ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు. 46.25 రేటింగ్‌ పాయింట్లతో శాంట్నర్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

 

9)  ఈ ప్రపంచకప్‌లో అద్భుత ద్వి శతకంతో సత్తా చాటిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. 45.07 రేటింగ్‌ పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 

 

10) మరో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్ ఫిలిప్స్‌ 42.76 రేటింగ్ పాయింట్లతో జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.  

ప్రపంచకప్‌లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేసిన జట్లను కూడా ఐసీసీ ప్రకటించింది. ఆస్ట్రేలియా (383.58) అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా (340.59), నెదర్లాండ్స్‌ (292.02), భారత్ (281.04), ఇంగ్లాండ్ (255.43), న్యూజిలాండ్ (225.53), పాకిస్థాన్ (212.61), శ్రీలంక (184.83), బంగ్లాదేశ్‌ (174.98), అఫ్గానిస్థాన్‌ (123.12) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.