ICC Rankings: ఆసియా కప్ ఫైనల్‌లో అద్భుతంగా ఆడి శ్రీలంకను చిత్తు చేసిన భారత క్రికెట్ జట్టు గెలుపు శత్రు దేశానికి అగ్రస్థానాన్ని తెచ్చిపెట్టింది. భారత్ విజయం పాకిస్తాన్ నెత్తిన పాలు పోసినట్టైంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్ సేన మళ్లీ నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంది. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో వరుస ఓటములు కూడా పాకిస్తాన్‌కు కలిసొచ్చాయి.
అలా ఎలా..?
ఆసియా కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బాబర్ సేన.. భారత్, శ్రీలంక చేతిలో ఓడి సూపర్ - 4 దశలోనే నిష్క్రమించడంతో పాటు నెంబర్ వన్ ర్యాంకును కూడా కోల్పోయింది. గత వారం ర్యాంకింగ్స్ ప్రకారం.. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా భారత్, పాకిస్తాన్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో భారత్ గెలిచిఉంటే మనకే నెంబర్ వన్ హోదా దక్కేది. కానీ బంగ్లా జట్టు భారత్‌కు షాకివ్వడంతో భారత్ అగ్రస్థానం హోదా చేజారింది. మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా తొలి రెండు వన్డేలలో గెలిచి అగ్రస్థానానికి చేరినా గత మూడు వన్డేలలో సఫారీలు కంగారూలను చిత్తుచిత్తుగా ఓడించారు. ఇది పాకిస్తాన్‌కు కలిసొచ్చింది. ఆసియా కప్‌లో శ్రీలంకను ఓడించిన తర్వాత పాకిస్తాన్, భారత్‌లు తలా 115 పాయింట్లతో మొదటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా (113 పాయింట్లు) మూడో స్థానానికి పడిపోయింది.
భారత్‌కు మరో ఛాన్స్..
బంగ్లాతో మ్యాచ్‌లో ఓడటం ద్వారా వన్డేలలో నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయిన భారత్‌కు వన్డే వరల్డ్ కప్ ముందు ఆ స్థానాన్ని చేరుకోవడానికి సదావకాశం ఉంది. ఆసియా కప్ తర్వాత భారత్.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి వన్డేలో భారత్.. ఆసీస్‌ను ఓడిస్తే నెంబర్ వన్ ర్యాంకు సొంతమవుతుంది. 2-1 తేడాతో గెలిచినా భారత్ ఆ ర్యాంకును నిలబెట్టుకుంది. అలా కాకుండా ఆసీస్ గనక వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే కంగారూలు మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటారు. పాక్ 2, భారత్ 3వ స్థానాల్లో ఉంటాయి. ఒకవేళ భారత్ సిరీస్ గెలిస్తే అప్పుడు వన్డే ప్రపంచకప్‌కు ముందు మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంకు హోదాలో వరల్డ్ కప్‌లో బరిలోకి దిగొచ్చు. ఇప్పటికే భారత్ టెస్టులు, టీ20లలో నెంబర్ వన్ హోదాను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి భారత్ - ఆస్ట్రేలియా వన్డే సిరీస్ మొదలవుతుంది.
ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో కూడా భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. టీ20లలో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ వన్ బ్యాటర్ కాగా ఈ ఫార్మాట్‌లో ఆల్ రౌండర్ల జాబితాలో హార్ధిక్ పాండ్యా రెండో స్థానంలతో నిలిచాడు. వన్డేలలో బాబర్ ఆజమ్ ఫస్ట్ ర్యాంకును నిలబెట్టుకోగా శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 8, రోహిత్ శర్మ 9వ స్థానాలలో కొనసాగుతున్నారు. వన్డే బౌలర్ల జాబితాలో కుల్‌దీప్ యాదవ్ ఏడో స్థానంలో ఉండగా మహ్మద్ సిరాజ్ 9వ ర్యాంకులో ఉన్నాడు. వన్డే ఆల్ రౌండర్లలో హార్ధిక్ ఆరో స్థానంలో ఉన్నాడు. టెస్టులలో నెంబర్ వన్ బౌలర్‌గా అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా రవీంద్ర జడేజా 3, జస్ప్రీత్ బుమ్రా పదో స్థానంలో ఉన్నాడు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో జడ్డూ, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ ఐదో స్థానంలో నిలిచాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial