ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను గెలిపించిన మహ్మద్ సిరాజ్ చేసిన పని ఇప్పుడు నెటిజన్ల మనసు దోచుకుంటోంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద తనకు వచ్చిన ఐదు వేల డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.4.15 లక్షలు) ప్రైజ్ మనీని శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్‌కు ఇచ్చేశారు. ఎందుకంటే వర్షం కారణంగా ఎఫెక్ట్ అయిన ఈ టోర్నమెంట్‌లో గ్రౌండ్ స్టాఫ్ ఎంతో కష్టపడ్డారు.
‘ఈ క్యాష్‌ప్రైజ్ గ్రౌండ్స్‌మన్‌కు ఇచ్చేస్తున్నారు. వారు దీనికి పూర్తిగా అర్హులు. వారి కృషి లేకపోతే ఈ టోర్నమెంట్ జరిగేది కాదు.’ అని మహ్మద్ సిరాజ్ అన్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ జే షా కూడా కాండీ, కొలంబో మైదానాలకు సంబంధించిన గ్రౌండ్ స్టాఫ్‌కు 50 వేల డాలర్ల (సుమారు రూ.41.5 లక్షలు) ప్రైజ్ మనీ అందించారు.
ఆసియా కప్‌లో దాదాపుగా శ్రీలంకలో జరిగిన అన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఆఖరికి ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆలస్యం అయింది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్ కూడా రిజర్వ్‌డే నాడు జరిగింది.
శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27: 19 బంతుల్లో, ఆరు ఫోర్లు), ఇషాన్ కిషన్ (23: 18 బంతుల్లో, మూడు ఫోర్లు) వికెట్ పడనివ్వకుండానే టార్గెట్ ఫినిష్ చేశారు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ (17: 34 బంతుల్లో, మూడు ఫోర్లు), దుషాన్ హేమంత (13 నాటౌట్: 15 బంతుల్లో, ఒక ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరును కొట్టగలిగారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున మొత్తం 10 వికెట్లనూ పేసర్లే తీసుకున్నారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీసుకున్నారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. కానీ వారి నిర్ణయం తక్కువ సమయంలోనే వారి నిర్ణయం తప్పని తేలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ కుశాల్ పెరీరా (0: 2 బంతుల్లో) వికెట్ పడగొట్టి జస్‌ప్రీత్ బుమ్రా భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. దీంతో శ్రీలంక స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరేసరికే తన మొదటి వికెట్ కోల్పోయింది.
ఇక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో హైదరాబాదీ ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ ఓవర్ మొదటి బంతిని పతుం నిశ్శంక (2: 4 బంతుల్లో) బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు బంతిని ఆడబోయి రవీంద్ర జడేజా పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సదీర సమరవిక్రమ (0: 2 బంతుల్లో) రెండో బంతికి పరుగులు ఏమీ చేయలేదు. మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి చరిత్ అసలంక (0: 1 బంతి) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఐదో బంతిని ధనంజయ డిసిల్వ (4: 2 బంతుల్లో, ఒక ఫోర్) బౌండరీ కొట్టాడు. చివరి బంతికి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ధనంజయ డిసిల్వ అవుట్ అయ్యాడు. దీంతో శ్రీలంక జట్టు కేవలం 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.