India vs Sri Lanka Final Asia Cup: ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఏకపక్షంగా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మొత్తం జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా సాధించింది. దీంతో ఎనిమిదోసారి ఆసియాకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డులను కూడా సృష్టించింది.


బంతుల పరంగా అతి పెద్ద విజయం
శ్రీలంకతో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు తన వన్డే క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 263 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది. అంతకుముందు 2001లో భారత జట్టు అత్యధిక బంతులు మిగిలి ఉండగానే వన్డేలో విజయం సాధించింది. కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో బ్లూమ్‌ఫోంటైన్ మైదానంలో భారత జట్టు 231 బంతుల తేడాతో విజయం సాధించింది.


వన్డే క్రికెట్ చరిత్రలో టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది రెండోసారి. అంతకుముందు 1998లో జింబాబ్వేతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 197 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా సాధించింది. దీని తర్వాత 2003లో సిడ్నీ మైదానంలో ఇంగ్లండ్‌పై 118 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో గెలిచి తన స్థానాన్ని సంపాదించుకున్న టీమ్ ఇండియా మూడో స్థానంలో ఉంది.


వన్డే టోర్నీలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక బంతులు మిగిలిన విజయాల్లో భారత జట్టు ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది. 263 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయం సాధించింది. ఇంతకుముందు 2003లో సిడ్నీ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 226 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా గెలిచి ఈ రికార్డును తన పేర లిఖించుకుంది.


ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఈ ఓవర్ మొదటి బంతిని పతుం నిశ్శంక (2: 4 బంతుల్లో) బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు బంతిని ఆడబోయి రవీంద్ర జడేజా పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సదీర సమరవిక్రమ (0: 2 బంతుల్లో) రెండో బంతికి పరుగులేమీ చేయలేదు. మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి చరిత్ అసలంక (0: 1 బంతి) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఐదో బంతిని ధనంజయ డిసిల్వ (4: 2 బంతుల్లో, ఒక ఫోర్) బౌండరీ కొట్టాడు. చివరి బంతికి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ధనంజయ డిసిల్వ అవుట్ అయ్యాడు. దీంతో శ్రీలంక జట్టు కేవలం 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial