శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో భారత్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.


భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27: 19 బంతుల్లో, ఆరు ఫోర్లు), ఇషాన్ కిషన్ (23: 18 బంతుల్లో, మూడు ఫోర్లు) వికెట్ పడనివ్వకుండానే టార్గెట్ ఫినిష్ చేశారు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ (17: 34 బంతుల్లో, మూడు ఫోర్లు), దుషాన్ హేమంత (13 నాటౌట్: 15 బంతుల్లో, ఒక ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరును కొట్టగలిగారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున మొత్తం 10 వికెట్లనూ పేసర్లే తీసుకున్నారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీసుకున్నారు.


వికెట్ పడకుండా...
ఈ మ్యాచ్‌లో కొట్టాల్సిన లక్ష్యం తక్కువే కావడంతో భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27: 19 బంతుల్లో, ఆరు ఫోర్లు), ఇషాన్ కిషన్ (23: 18 బంతుల్లో, మూడు ఫోర్లు) వేగంగా ఆడారు. దీంతో కేవలం 6.1 ఓవర్లలోనే టీమిండియా టార్గెట్ కొట్టేసింది.


నిప్పులు చెరిగిన పేసర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ తీసుకుంది. కానీ వారి నిర్ణయం తప్పని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే కుశాల్ పెరీరా (0: 2 బంతుల్లో) వికెట్ పడగొట్టి బుమ్రా భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. దీంతో శ్రీలంక ఒక్క పరుగుకే తన మొదటి వికెట్ కోల్పోయింది.


ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఈ ఓవర్ మొదటి బంతిని పతుం నిశ్శంక (2: 4 బంతుల్లో) బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు బంతిని ఆడబోయి రవీంద్ర జడేజా పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సదీర సమరవిక్రమ (0: 2 బంతుల్లో) రెండో బంతికి పరుగులేమీ చేయలేదు. మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి చరిత్ అసలంక (0: 1 బంతి) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఐదో బంతిని ధనంజయ డిసిల్వ (4: 2 బంతుల్లో, ఒక ఫోర్) బౌండరీ కొట్టాడు. చివరి బంతికి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ధనంజయ డిసిల్వ అవుట్ అయ్యాడు. దీంతో శ్రీలంక జట్టు కేవలం 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.


అంతటితో ఆగకుండా తర్వాత ఓవర్లో కెప్టెన్ దసున్ షనకను (0: 4 బంతుల్లో) కూడా మహ్మద్ సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో శ్రీలంక కేవలం 12 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కుశాల్ మెండిస్ (17: 34 బంతుల్లో, మూడు ఫోర్లు),  దనుత్ వెల్లలాగే (8: 21 బంతుల్లో) ఆరో వికెట్‌కు 21 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. అనంతరం మహ్మద్ సిరాజ్ మళ్లీ శ్రీలంకను దెబ్బ కొట్టాడు. 12వ ఓవర్లో కుశాల్ మెండిస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి మూడు వికెట్లను హార్దిక్ టకటకా తీసుకున్నాడు. దీంతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ జట్టుపై శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోరు. ఓవరాల్‌గా చూసుకున్నా ఇది శ్రీలంకకు రెండో అత్యల్ప స్కోరు.