ODI World Cup 2023:
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో హైదరాబాద్‌కు అసలు మ్యాచులే కేటాయించలేదు! ఏదో అభిమానులను సంతృప్తి పరిచేందుకు వార్మప్ మ్యాచులు నిర్వహిస్తున్నారు. అందులోనూ ఒక మ్యాచుపై ఇప్పుడు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచుకు రక్షణ కల్పించలేమని పోలీసులు అంటున్నారని సమాచారం.
ఉప్పల్ స్టేడియంలో సెప్టెంబర్ 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ సన్నాహక మ్యాచ్ ఆడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు పోరు మొదలవుతుంది. అరగంట ముందే టాస్ వేస్తారు. పెద్ద జట్లే కావడంతో ఆటగాళ్లు, మ్యాచును వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా. అయితే ఈ మ్యాచుకు భద్రత కల్పించలేమని రాచకొండ పోలీసులు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి సమాచారం ఇచ్చారని తెలిసింది.
సెప్టెంబర్ 28న గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఉన్నాయి. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ రెండు వేడుకలు ఓకే రోజు వస్తున్నాయి. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం వేల మంది పోలీసులను ప్రభుత్వం నియోగించనుంది. ఇక మ్యాచ్ జరిగే రోజూ నిమజ్జనం కొనసాగుతుంది. అలాంటప్పుడు ముందు రోజే 24 గంటలు డ్యూటీ చేసిన పోలీసులు అలసిపోయే ప్రమాదం ఉంది. దాంతో మ్యాచుకు బందోబస్తు కష్టమని పోలీసు ఉన్నతాధికారులు హెచ్‌సీఏకు తెలిపారు. ఈ మేరకు మ్యాచ్ తేదీని మార్చాలని బీసీసీఐకి హైదరాబాద్ క్రికెట్ సంఘం విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.
రెండు రోజుల క్రితమే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో తలపడే జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ - చెన్నై మ్యాచ్‌లో గాయమై శస్త్రచికిత్స చేయించుకొని ఇన్నాళ్లూ ఆటకు దూరమైన కేన్ మామ తిరిగి జాతీయ జట్టుతో చేరాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కివీస్ నలుగురు పేసర్లు, ఇద్దరు పేస్ ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. మిగిలినవారిలో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నారు. కాగా గతేడాది కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వ్యక్తిగత కారణాల రీత్యా న్యూజిలాండ్ బోర్డు కాంట్రాక్టు వదులకున్నా అతడిని ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో చేర్చారు. బౌల్ట్‌తో పాటు జేమ్స్ నీషమ్ కూడా కాంట్రాక్టు లేకున్నా వరల్డ్ కప్ జట్టులో చేరాడు. ఇక ఇంగ్లాండ్‌తో వన్డేలకు దూరమైన కైల్ జెమీసన్, ఆడమ్ మిల్నేలకు నిరాశతప్పలేదు.
వన్డే ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాథ్యూ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్