సినిమా, క్రికెట్... భారతీయులకు వినోదం, కాలక్షేపం అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి ఈ రెండే! థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చినా, స్టేడియంలో మ్యాచులు జరుగుతున్నా వదిలిపెట్టరు. స్టేడియం వెళ్ళడానికి కుదరకపోతే కనీసం టీవీలో అయినా సరే చూస్తారు. తన ఆటతో ఎంతో మందిని అలరించిన ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan Biopic) జీవితం ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది.
లెజెండరీ ఆఫ్ స్పిన్నర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800' (800 Movie). ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, ఆయన భార్య మదిమలర్ పాత్రలో హీరోయిన్ మహిమా నంబియార్ నటించారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్టోబర్ 6న థియేటర్లలో '800' విడుదల
800 Movie Release Date : అక్టోబర్ 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో '800' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై వివేక్ రంగాచారి ఈ చిత్రాన్ని నిర్మించగా... ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) సొంతం చేసుకున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డౌట్స్ తీర్చిన హరీష్ శంకర్
'800' సినిమాలో కేవలం క్రికెట్ మాత్రమే కాదని, ముత్తయ్య మురళీధరన్ జీవితంలో బాల్యం నుంచి దిగ్గజ ఆటగాడిగా ఎదిగే వరకు జరిగిన ఎత్తుపల్లాలు ఉన్నాయని శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. హ్యూమన్ ఎమోషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని ఆయన చెప్పారు. ముంబైలో జరిగిన '800' ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
నాకు ఇష్టం లేదు - ముత్తయ్య మురళీధరన్!
ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ముత్తయ్య మురళీధరన్... నిజ జీవితంలో చాలా వినమ్రంగా ఉంటాడని, అతని జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని సచిన్ టెండూల్కర్ చెప్పారు. తన బయోపిక్ తీస్తానని శ్రీపతి వచ్చినపుడు తాను సుముఖత వ్యక్తం చేయలేదని ముత్తయ్య మురళీధరన్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''శ్రీపతి పట్టు వీడకుండా శ్రీలంక వచ్చి రెండేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అతని కమిట్మెంట్, కథను రాసిన తీరు చూసి ఓకే చెప్పా. కరోనా వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రజలంతా సినిమా చూస్తారని ఆశిస్తున్నా. సినిమా విడుదల చేస్తున్న శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ గారికి థాంక్స్'' అని చెప్పారు.
Also Read : విజయ్ 'లియో'కి ఆ దేశంలో నో కట్స్ - మరి, మన దేశంలో?
మధుర్ మిట్టల్, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ప్రవీణ్ కెఎల్, ఛాయాగ్రహణం : ఆర్.డి. రాజశేఖర్, సంగీతం : జిబ్రాన్, రచన - దర్శకత్వం : ఎంఎస్ శ్రీపతి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial