Asia Cup 2023 Final: ఆసియా కప్‌ తుది సమరానికి భారత్ సన్నద్ధమవుతోంది. సూపర్ 4 లో రోహిత్ సేన పాక్, శ్రీలంకపై వరుసగా విజయాలు సాధించి ఫైనల్‌కు చేరింది. సూపర్ 4లో భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ పోటీ పడడగా భారత్ రెండు విజయాలతో ఫైనల్ చేరింది. పాక్, శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్‌తో టైటిల్ పోరు కోసం గురువారం పాక్, శ్రీలంక తలపడనున్నాయి. అక్కడ గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌తో తలపడనుంది.


రిజర్వ్ డే ఉందా?
శ్రీలంకలో ఆసియా కప్ ప్రారంభం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని మ్యాచులు పూర్తిగా రద్దవగా కొన్ని మధ్యలో ఆపేశారు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ కోసం రిజర్వ్ డేని ఉంచింది. అయితే గురువారం జరుగనున్న శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ కోసం అలాంటి ఏర్పాటు లేదు. శ్రీలంక-పాకిస్థాన్‌లలో దీంతో ఎవరు ఫైనల్‌కు వెళ్లాలన్నా గురువారం 20 ఓవర్ల చొప్పున పోటీ జరగాల్సి ఉంది.


వర్షం వస్తే ఏం జగుగుతుంది?
ఆసియా కప్ 2023లో చాలా మ్యాచ్‌లపై వర్షం ప్రభావం చూపింది. గురువారం కొలంబోలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడం ఒక ప్రతికూల అంశం. ఒక వేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దైతే శ్రీలంకకు కలిసొస్తుంది. పాకిస్తాన్‌తో పోల్చితే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.


ప్రస్తుతం, పాకిస్తాన్‌, శ్రీలంకకు 2 పాయింట్లు చొప్పున సమానంగా ఉన్నాయి. పాక్, శ్రీలంక చెరో మ్యాచ్ గెలిచాయి. ఒక మ్యాచ్ ఓడిపోయాయి. కానీ నెట్ రన్ రేట్ ప్రకారం శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ మూడవ స్థానంలో నిలిచింది. శ్రీలంక నెట్ రన్ రేట్ -0.200 వద్ద ఉండగా, పాకిస్తాన్ నెట్ రన్ రేట్ -1.892గా ఉంది. ఈ లెక్కలో పాకిస్తాన్ ఫైనల్ చేరాలంటే లంకేయులను ఓడించాల్సిందే. ఈ  మ్యాచ్‌లో ఫలితం రావాలంటే కనీసం 20 ఓవర్ల చొప్పున మ్యాచ్ జరగాల్సిందే. ఇక్కడ గెలిస్తేనే పాక్ ఫైనల్‌లో భారత్‌తో తలపడుతుంది. వర్షంతో మ్యాచ్ రద్దయితే శ్రీలంక ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కు చావో రేవో పరిస్థితి కల్పించింది.


ఆసియా కప్ ఫైనల్లో తలపడని భారత్, పాక్
అయితే ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే ఆసియా కప్‌ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ ఇప్పటి వరకు తలపడలేదు. ఇప్పటి వరకు ఆసియా కప్‌ పోటీలు 15 (ODI, T20) సార్లు జరిగాయి. భారత్, శ్రీలంక కలిసి 13 టైటిళ్లను గెలుచుకున్నాయి. మిగతా రెండు ఎడిషన్లలో పాకిస్థాన్ విజయం సాధించింది. టోర్నీలో బంగ్లాదేశ్ ఇంకా గెలవలేదు. భారత్ ఏడు సార్లు టైటిల్స్ (ఆరు వన్డేలు, ఒక టీ20) విజేతగా నిలిచింది.  అలాగే శ్రీలంక ఆరు సార్లు కప్ సాధించింది. పాకిస్తాన్ రెండు సార్లు మాత్రమే ఆసియా కప్ దక్కించుకుంది. తొలి టైటిల్‌ను గెలుచుకోవడానికి పాకిస్తాన్‌కు 16 ఏళ్లు పట్టింది. 2000లో ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టోర్నమెంట్‌ను గెలుచుకుంది. 


నేటి మ్యాచ్ వివరాలు
ఎవరెవరికి : పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక
ఎక్కడ: ప్రేమదాస స్టేడియం, కొలంబో
సమయం: గురువారం మధ్యాహ్నం 3 గంటలకు