Asia Cup 2023, PAK Vs SL: ఆసియా కప్ - 2023 ఫైనల్ బెర్త్‌ను ఇదివరకే ఖాయం చేసుకున్న భారత జట్టుతో తుదిపోరులో ఆడేది ఎవరో నేటితో తేలనుంది. పాకిస్తాన్ - శ్రీలంకల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన విజేత.. ఈనెల 17 (ఆదివారం)న భారత్‌తో తలపడనుంది. సూపర్ - 4లో ఇరు జట్లకూ ఇదే ఆఖరి ఛాన్స్ కాగా రెండు జట్లూ ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోసారి దాయాదితో తలపడాలంటే పాకిస్తాన్.. గురువారం శ్రీలంకను ఓడించాలి. ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.
పాకిస్తాన్ పుంజుకునేనా?
మొన్నటివరకూ ఆసియా కప్‌లో హాట్ ఫేవరేట్‌గా ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మూడు రోజుల క్రితం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో ఓడటంతో ఆ జట్టుకు నేడు లంకతో జరిగే మ్యాచ్‌లో గెలవడం అనివార్యమైంది. దుర్భేద్యమైన తమ బౌలింగ్ లైనప్‌ను భారత టాపార్డర్ చీల్చి చెండాడటంతో బాబర్ సేన బిక్కమొహం వేసింది. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లతో పాటు స్పిన్నర్ షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్‌లనూ భారత బ్యాటర్లు ఆటాడుకున్నారు. అదీగాక భారత్‌తో ఆడిన హరీస్ రౌఫ్, నసీమ్ షా గాయాల కారణంగా నేటి మ్యాచ్‌లో అందుబాటులో ఉండటం లేదు. భారత్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ అఘా సల్మాన్ కూడా ఆడేది అనుమానమే. అతడి స్థానంలో సౌద్ షకీల్‌ను ఆడించాలని పాకిస్తాన్ భావిస్తున్నది.
హరీస్, నసీమ్ లేకపోవడంతో పాకిస్తాన్ పేస్ భారాన్ని షహీన్ మోయనున్నాడు. అతడికి తోడుగా మహ్మద్ వసీం, జమాన్ ఖాన్‌లు పేస్ బాధ్యతలు చూడనున్నారు. ఇక తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో 150 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. రిజ్వాన్ కూడా వైఫల్యం కొనసాగిస్తున్నాడు. ఇమామ్ ఉల్ హక్, ఇఫ్తికార్ అహ్మద్‌లే నిలిస్తేనే పాకిస్థాన్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. ఈ టోర్నీకి ముందు టన్నుల కొద్దీ పరుగులు చేసిన ఫకర్ జమాన్ వరుసగా విఫలమవుతుండటంతో ఓపెనర్‌గా మహ్మద్ హరీస్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.
లంకకూ ఆఖరి ఛాన్స్..
ఆసియా కప్‌లో అత్యధిక ఫైనల్స్ ఆడిన శ్రీలంక.. భారత్ - పాకిస్తాన్ పోరును జరగనీయకూడదని అనుకుంటే అభిమానులకు మరోసారి భారత్ - శ్రీలంక ఫైనల్ తప్పదు. భారత్‌తో లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఓడినా శనక సేన టీమిండియాను ఓడించినంత పనిచేసింది. ప్రధాన బౌలర్లు లేకున్నా ఉన్న బౌలర్లతోనే అద్భుతాలు చేస్తోంది. భారత బ్యాటర్లను ఔట్ చేయడానికి పాక్ బౌలర్లు తంటాలు పడగా శ్రీలంక మాత్రం స్పిన్ ఉచ్చులో బందించింది. యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగె భారత్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. స్పిన్‌కు అనుకూలించే కొలంబో పిచ్‌పై ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంకలతో పాటు మహీశ్ తీక్షణ కూడా రెచ్చిపోతున్నారు. మొన్న భారత్‌తో మ్యాచ్‌లో మాదిరిగానే నేడు కూడా కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే పాక్‌కు షాకివ్వడానికి లంక స్పిన్నర్లు రెడీ అయ్యారు.
బ్యాటింగ్‌లో పతుమ్ నిస్సంక లంకకు కీలక బ్యాటర్. నిస్సంకతో పాటు మెండిస్, సమరవిక్రమలు పాకిస్తాన్ బౌలింగ్ ఎటాక్‌ను ఏ మేరకు అడ్డుకుంటారనేది చూడాలి. ఏడో నెంబర్ బ్యాటర్ వెల్లలాగె వరకూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం లంకకు కలిసొచ్చేదే.
వర్షం వస్తే..
కొలంబోలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పాక్-లంక మ్యాచ్‌కూ ముప్పు లేకపోలేదు. ఉదయం వర్షం కురిసే అవకాశాలు 93 శాతం ఉంటే మ్యాచ్ ఆరంభమయ్యేటప్పటికీ అవి 43 శాతానికి తగ్గుతాయి. అయితే వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే మాత్రం అది పాక్ కంటే లంకకే ఎక్కువ మేలు చేస్తుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టిక ప్రకారం భారత్.. 4 పాయింట్లు, +2.690 నెట్ రన్ రేట్‌తో మెరుగైన స్థితిలో ఉంది. రెండో స్థానంలో ఉన్న శ్రీలంక నెట్ రన్ రేట్ -0.200 గా ఉంది. మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ నెట్ రన్ రేట్ -1.892గా ఉంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కాకుండా ఉంటే మాత్రం పాకిస్తాన్ తప్పకుండా గెలిస్తేనే ఆదివారం భారత్‌తో ఫైనల్ ఆడుతుంది.
తుది జట్లు (అంచనా) :
పాకిస్తాన్ : మహ్మద్ హరీస్, ఇమామ్ ఉల్ హఖ్, బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, షహీన్ అఫ్రిది, జమన్ ఖాన్
శ్రీలంక : పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, దునిత్ వెల్లలగె, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, మతీశ పతిరాన
మ్యాచ్ వెన్యూ, టైమింగ్స్ :
- కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరంభం కానుంది.
లైవ్ చూడటం ఇలా..
- ఈ మ్యాచ్‌ను స్టార్ నెట్‌వర్క్‌లో హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు తెలుగులో కూడా వీక్షించొచ్చు. మొబైల్స్‌లో అయితే ఎలాంటి రుసుము లేకుండానే డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో చూసేయొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial