ICC ODI Team Ranking: మరో మూడు రోజుల్లో  మొదలుకాబోయే  ఆసియా కప్‌కు ముందు పాకిస్తాన్  జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తూ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు అగ్రస్థానానికి ఎగబాకింది.  ఆస్ట్రేలియాను వెనక్కినెట్టిన బాబర్ ఆజమ్ అండ్ కో. వరల్డ్ నెంబర్ వన్ టీమ్ హోదాలో ఆసియా కప్‌లో బరిలోకి దిగనుంది.  శ్రీలంకలోని కొలంబో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన  మూడో వన్డేలో ఘన విజయం సాధించిన  తర్వాత  పాకిస్తాన్.. వన్డేలలో అగ్రస్థానాన్ని సాధించింది. 


వన్డే ర్యాంకింగ్స్‌లో  పాకిస్తాన్.. 118 రేటింగ్  పాయింట్లతో ఆస్ట్రేలియాతో కలిసి సమానంగా ఉంది.  కానీ పాయింట్ల విషయంలో పాకిస్తాన్ పైచేయి సాధించడంతో  ఆ జట్టుకు నెంబర్ వన్ హోదా దక్కింది.  పాకిస్తాన్  పాయింట్లు 2,725 కాగా ఆస్ట్రేలియా.. 2,714 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది.  ఇరు జట్ల మధ్య పాయింట్ల తేడా  11  మాత్రమే కావడం విశేషం. 


ఈ జాబితాలో భారత జట్టు 113 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.  భారత్ తర్వాత న్యూజిలాండ్ (104), ఇంగ్లాండ్ (101) టాప్ - 5లో నిలిచాయి.  సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, వెస్టిండీస్‌లు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.   వన్డేలలో మూడో స్థానానికి పరిమితమైన భారత్.. టీ20, టెస్టులలో మాత్రం నెంబర్ వన్ హోదాను దక్కించుకుంది. టీ20లలో  264 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాలు  టాప్ - 5లో ఉన్నాయి. టెస్టులలో ఇండియా 118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్ - 5లో  నిలిచాయి. 






ఇక కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా అఫ్గాన్‌తో జరిగిన చివరి వన్డేలో  పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్థ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో  అఫ్గానిస్తాన్.. 48.4 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో 8వ స్థానంలో వచ్చిన ముజీబ్ ఉర్ రెహ్మాన్ (37 బంతుల్లో 64, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేసి అఫ్గాన్ జట్టులో  ఆశలు నింపాడు.  కానీ అతడు హిట్ వికెట్ గా వెనుదిరగడంతో ఆ జట్టు ఆశలు అడియాసలయ్యాయి.   ఈ విజయంతో పాకిస్తాన్.. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 


ఆసియా కప్‌కు పాకిస్త్ జట్టులో మార్పులు.. 


ఆసియా కప్ లో పాల్గొనబోయే జట్టులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనూహ్య మార్పులు చేసింది. ఇదివరకే ప్రకటించిన 17 మంది సభ్యులలో సౌద్ షకీల్‌ను చేర్చింది.  గతంలో ప్రకటించిన తయ్యబ్ తాహిర్‌ను  ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉంచింది. 


ఆసియా కప్‌కు పాకిస్తాన్  టీమ్ : బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలి అఘా, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ మీర్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్ (ట్రావెలింగ్ రిజర్వ్) 





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial