World Cup 2023 Schedule:
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023లో టీమ్‌ఇండియా దేశవ్యాప్తంగా పర్యటించనుంది. ఎంపిక చేసిన 10 వేదికల్లో తొమ్మిదింట్లో లీగు మ్యాచులు ఆడనుంది. దేశవ్యాప్తంగా అభిమానులను అలరించనుంది. ఇక దాయాది పాకిస్థాన్ మాత్రం కేవలం ఐదు వేదికలకే పరిమితం అవుతోంది. ఉద్దేశపూర్వకంగానే కొన్ని నగరాల్లో పర్యటించేందుకు అంగీకరించలేదు. కాగా ఈ మెగా టోర్నీలో టీమ్‌ఇండియా ఆడబోయే మ్యాచుల వేదికలు, తేదీల వివరాలు మీకోసం!
చెన్నైలో ఆసీస్‌తో మొదలు
మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలవుతుండగా టీమ్‌ఇండియా అక్టోబర్ 8న, ఆదివారం తన జైత్రయాత్ర ప్రారంభించనుంది. చెన్నై వేదికగా ఐదుసార్లు ప్రపంచ విజేత ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అక్కడి నుంచి వెంటనే దిల్లీకి పయనం అవుతుంది. అక్టోబర్ 11న అఫ్గానిస్థాన్‌తో అరుణ్‌జైట్లీ మైదానంలో తలపడుతుంది. ఆ తర్వాత రోహిత్ సేనకు నాలుగు రోజుల విరామం దొరికింది. అక్టోబర్ 15, ఆదివారం మోస్ట్ థ్రిల్లింగ్, ఎంటర్‌టైనింగ్ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతేరా (అహ్మదాబాద్)లో దాయాది పాకిస్థాన్‌ను ఎదుర్కోనుంది.
పాక్ తర్వాత ఇంగ్లాండ్‌తో డేంజర్
ఇక అక్టోబర్ 19, గురువారం రోజు పుణెలో బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా తలపడుతుంది. అక్టోబర్ 22న కీలకమైన న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఇదీ ఆదివారమే జరుగుతోంది. ధర్మశాలను వేదికగా ఎంపిక చేశారు. ఈ మ్యాచ్ తర్వాత భారత్‌కు ఆరు రోజులు విశ్రాంతి దొరుకుతుంది. ఆపై మరో ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 29, ఆదివారం రోజు లక్నోలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.
ఆఖర్లో దక్షిణాఫ్రికాతో
టీమ్‌ఇండియా ఆడబోయే ఆఖరి మూడు లీగు మ్యాచుల్లో ఒక్కటే బలమైన జట్టు! అదే దక్షిణాఫ్రికా. నవంబర్ 5న ఈడెన్ గార్డెన్‌లో ఈ మ్యాచ్ ఉంటుంది. ఇక నవంబర్ 2న వాంఖడే, నవంబర్ 11న బెంగళూరులో క్వాలిఫయర్ జట్లతో హిట్‌మ్యాన్ సేన ఆడుతుంది. మరి కొన్ని రోజుల్లో ఈ జట్లేంటో తెలిసిపోతుంది. కాగా తెలుగు అభిమానులకు నిరాశే ఎదురైంది. టీమ్‌ఇండియా మ్యాచులేవీ హైదరాబాద్‌కు కేటాయించలేదు.
వేదికల వెనక వ్యూహం!
ఈ వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఆడబోతున్న ప్రతి వేదికను వ్యూహాత్మకంగా ఎంపికచేసినట్టే కనిపిస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచును ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రత్యక్షంగా చూడాలని భావిస్తారు. అందుకే లక్షా పదివేల మందికి సరిపోయే అహ్మదాబాద్‌ను ఎంపిక చేశారు. ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియాతో చెపాక్‌ను ఎంపిక చేయడం వెనక మరో ఉద్దేశం ఉంది. ఇక్కడి పిచ్ స్పిన్‌కు సహకరిస్తుంది. ఆసీస్‌కు మెరుగైన రికార్డేమీ లేదు. మనకు కొంత అడ్వాండేజీ ఉంటుంది.
Also Read: 46 రోజులు.. 48 మ్యాచులు - ఐసీసీ వన్డే ప్రపంచకప్ షెడ్యూలు వచ్చేసిందోచ్!
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో ఆడే లక్నో పిచ్ ఎలా ఉంటుందో తెలిసిందే. చాలా స్లో ట్రాక్. బౌన్స్ ఎలా ఉంటుందో అర్థమవ్వదు. సాధ్యమైనంత నెమ్మదిగా ఆడాలిక్కడ. ఆంగ్లేయులు ఈ మధ్య దూకుడుగా ఆడే సంగతి ఎరుకే. న్యూజిలాండ్‌తో ధర్మశాలలో ఆడే పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తుంది. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial