బహుశా క్రికెట్‌ అతిగా ప్రేమించే వాళ్లు మాత్రమే ఈ అద్భుతమైన మ్యాచ్ చూసి ఉంటారేమో. చాలా మందికి ఇలాంటి మ్యాచ్‌ ఒకటి జరిగి ఉంటుందని కూడా తెలియదు. అవును నెదర్లాండ్, విండీస్ మధ్య అలాంటి మ్యాచ్‌ సోమవారం జరిగింది. ఈజీగా విండీస్‌ గెలిచేస్తుందిలే అనుకున్న మ్యాచ్‌లో మంచి ఫైట్ ఇచ్చి విజయాన్ని నమోదు చేసింది నెదర్లాండ్. అంతే కాదు విండీస్‌ క్రికెట్‌ కెరీర్‌నే ప్రమాదంలో పడేసింది. క్రికెట్‌లో ఎప్పుడైనా అద్భతం జరగొచ్చు అని చెప్పేందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు ఈ మ్యాచ్. 


రెచ్చిపోయిన విండీస్


 మ్యాచ్ విషయానికి వస్తే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లోగ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ వెస్టిండీస్‌తో తలపడింది. తక్సింగా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న విండీస్‌ బ్యాటర్లు రెచ్చిపోయారు. నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మైదానానికి అన్ని వైపులా కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నారు. 


374 పరుగులు చేసిన విండీస్


నికోలస్ పూరన్ 65 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ అండగా నిలిచారు. వీళ్లద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. షాయ్ హోప్‌, కీమో పాల్ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించారు. అందరూ రాణించడంతో విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 374 పరుగులు చేసింది.


తగ్గని నెదర్లాండ్స్


లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు కూడా ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు మూలాలు ఉన్న ఆటగాడు తేజ నిడమానూరు 111 పరుగులతో అద్భుతంగా ఆడాడు. స్కాట్ ఎడ్వర్డ్స్ 67 పరుగులు చేశాడు. దీంతో విండీస్‌కు ఈజీ అనుకున్న మ్యాచ్‌ టఫ్‌ అయింది. 


ఆఖరి ఓవర్‌లో మ్యాజిక్


నెదర్లాండ్స్ విజయానికి చివరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి  వచ్చింది. అక్కడి నుంచి మ్యాచ్‌లో అసలు డ్రామా మొదలైంది. తొలి 5 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసింది నెదర్లాండ్స్. లాస్ట్ బంతికి ఒక్క పరుగు చేసే క్రమంలో లోగాన్ వాన్ బీక్‌ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. 


అద్భుతం చేసిన లోగాన్ వాన్ బీక్


మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. విండీస్ బౌలర్‌ జాసన్ హోల్డర్ సూపర్ ఓవర్ వేయగా లోగాన్ వాన్ బీక్‌ బ్యాటింగ్ చేశాడు. ఆ ఓవర్లో లోగాన్ 30 పరుగులు చేశాడు, ఇందులో అతను 4, 6, 4, 6, 6, 4 కొట్టాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 30 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ సూపర్ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు మాత్రమే చేసింది. దీంతో నెదర్లాండ్స్ సూపర్‌ విక్టరీ సాధించింది. సూపర్ ఓవర్‌ను ఆల్ రౌండర్ లోగాన్ వాన్ బీక్ బౌలింగ్ చేయడం గమనార్హం.


ఈ ఏడాది చివర్‌లో భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఇప్పటికే భారత్ సహా ఎనిమిది జట్లు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాలకు జింబాబ్వేలో క్వాలిఫయర్స్ జరుగుతున్నాయి. ఈ టోర్నీలో శ్రీలంక, వెస్టిండీస్ సహా 10 జట్లు ఆడుతున్నాయి. ఈ పరాజయంతో విండీస్‌ అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. సూప్‌ సిక్స్‌కు వెళ్లినప్పటికీ విండీస్ ఈసారి వరల్డ్‌కప్ ఆడటం అంత ఈజీ కాదు.