ICC ODI World Cup 2023 Schedule:


క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌! ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ షెడ్యూలు వచ్చేసింది. 46 రోజులు అలరించే ఈ మెగా టోర్నీ షెడ్యూలును ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. టోర్నీకి సరిగ్గా వంద రోజుల ముందు ప్రకటించింది. పాకిస్థాన్‌ పాల్గొనడంపై సందేహాలు ఉండటంతో ఆలస్యమైంది. చివరిసారి 12 నెలల ముందుగానే షెడ్యూలు విడుదల చేయడం గమనార్హం.


ఈ ప్రపంచకప్‌నకు బీసీసీఐ ఆతిథ్యం ఇస్తోంది. ఇందుకోసం 10 వేదికలను ఎంపిక చేశారు. టోర్నీ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ అహ్మదాబాద్‌లో ఆరంభ మ్యాచులో తలపడతాయి. అక్టోబర్‌ 8న టీమ్‌ఇండియా తన ప్రస్థానం మొదలెడుతుంది. తొలిపోరులో ఐదుసార్లు ప్రపంచవిజేత, కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను చెన్నైలో ఎదుర్కొంటోంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial


ఈ వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య హోదాలో టీమ్‌ఇండియాకు నేరుగా చోటు దక్కింది. మిగిలిన ఏడు జట్లు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌ నుంచి అర్హత సాధించాయి. మరో రెండు జట్లు జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయర్స్‌లో విజయం సాధించి చేరుకుంటాయి. మొత్తం 45 లీగు, 3 నాకౌట్‌ మ్యాచులు ఉంటాయి. అహ్మదాబాద్‌లో ఫైనల్‌ ఉంటుంది. కోల్‌కతా, ముంబయి ఒక్కో సెమీస్‌కు ఆతిథ్యం ఇస్తాయి.






టోర్నీ 2019 మాదిరిగా రౌండ్ రాబిన్‌ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో తలపడుతుంది. అంటే తొమ్మిది లీగు మ్యాచులు ఆడతాయి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. భారత్‌, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా 2020-2023 వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచి అర్హత పొందాయి. శ్రీలంక, వెస్టిండీస్‌, ఐర్లాండ్, నేపాల్‌, నెదర్లాండ్స్‌, ఒమన్‌, స్కాట్లాండ్‌, యూఏఈ, యూఎస్‌ఏ, జింబాబ్వేలో ఏవో రెండు జట్లు క్వాలిఫయర్స్‌లో గెలిచి ఎంపిక అవుతాయి.


మెగా టోర్నీకి పది వేదికలను నిర్ణయించారు. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ధర్మశాల, దిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబయి, కోల్‌కతాను ఎంపిక చేశారు. గువాహటి, తిరువనంతపురం, హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు వార్మప్‌ మ్యాచులు జరుగుతాయి. అహ్మదాబాద్‌లో ఫైనల్‌ ఉంటుంది. కోల్‌కతా, ముంబయిలో సెమీ ఫైనళ్లు నిర్వహిస్తారు. టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ సెమీస్‌లో తలపడితే కోల్‌కతా వేదికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


గుర్తుంచుకోవాల్సి తేదీలు


అక్టోబర్‌ 5 - ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ఆరంభ మ్యాచ్‌
అక్టోబర్‌ 9 - భారత్‌, ఆస్ట్రేలియా మధ్య చెన్నైలో పోరు
అక్టోబర్‌ 15 - భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అహ్మదాబాద్‌లో మ్యాచ్‌
అక్టోబర్‌ 28 - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య ధర్మశాలలో పోరు
అక్టోబర్‌ 29 - భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య లక్నోలో మ్యాచ్‌
నవంబర్‌ 1 - న్యూజిలాండ్‌ vs దక్షిణాఫ్రికా, పుణె
నవంబర్‌ 4 - ఇంగ్లాండ్‌ vs ఆస్ట్రేలియా, అహ్మదాబాద్‌
నవంబర్‌ 15 - మొదటి సెమీ ఫైనల్‌, ముంబయి
నవంబర్‌ 16- రెండో సెమీ ఫైనల్‌, కోల్‌కతా
నవంబర్‌ 19 - ఫైనల్‌, అహ్మదాబాద్‌