World Cup 2023: 


హైదరాబాద్‌ అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచులు ఉప్పల్‌ స్టేడియానికి కేటాయించకపోవడమే ఇందుకు కారణం! కనీసం టీమ్‌ఇండియా మ్యాచైనా ఇవ్వకపోవడం అందరికీ నిరాశ కలిగిస్తోంది.


ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. బీసీసీఐ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. మొత్తం 10 జట్లు 46 రోజులు 48 మ్యాచులు ఆడుతున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా పది వేదికలను ఎంపిక చేశారు.


హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ధర్మశాల, దిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబయి, కోల్‌కతాను వేదికలుగా ఎంపిక చేశారు. గువాహటి, తిరువనంతపురం, హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు వార్మప్‌ మ్యాచులు జరుగుతాయని ప్రకటించారు.


అహ్మదాబాద్‌లోని మొతేరాలో ఫైనల్‌ ఉంటుంది. కోల్‌కతా, ముంబయిలో సెమీ ఫైనళ్లు నిర్వహిస్తారు. టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ సెమీస్‌లో తలపడితే కోల్‌కతా వేదికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే హైదరాబాద్‌కు ఈ టోర్నీలో కేవలం మూడు లీగు మ్యాచుల్నే కేటాయించారు. అందులో రెండు పాకిస్థాన్‌వే ఉన్నాయి. మిగిలిన మూడో మ్యాచులో న్యూజిలాండ్‌ ఆడుతుంది.


ఈ మూడు మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లేంటో ఇంత వరకు తేలలేదు. ఉప్పల్‌ స్టేడియానికి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ అర్హత పోటీల్లో అర్హత సాధించబోయే జట్లే వస్తాయన్నమాట! అంటే పెద్ద జట్లు, కీలక పోటీలేమీ ఇక్కడ ఉండటం లేదు. టీమ్‌ఇండియాకు అసలు మ్యాచే కేటాయించలేదు. పోనీలే అనుకున్నా.. కనీసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికావైనా పెట్టడం లేదు. దీంతో తెలుగు అభిమానులు నిరాశ చెందుతున్నారు.


పెద్ద జట్లలోని కొందరు ఆటగాళ్లతో హైదరాబాద్‌, స్థానిక అభిమానులతో సంబంధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు భాగ్యనగరం అంటే ఎంతో ఇష్టం. ఉప్పల్‌లో ఆడిన ప్రతిసారీ అతడు ఫ్యాన్స్‌ను మురిపిస్తాడు. అలాగే కేన్‌ విలియమ్సన్‌కూ అభిమానగణం ఉంది. దక్షిణాఫ్రికా ఆటగాడు అయిడెన్‌ మార్‌క్రమ్‌ సన్‌రైజర్స్‌కు కెప్టెన్సీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ యువ ఆటగాడు బ్రూక్‌ హ్యారిస్‌కు హైదరాబాదీలు అండగా నిలబడ్డారు. జోస్‌ బట్లర్‌ బ్యాటింగ్‌నూ ఆస్వాదిస్తారు.


పాకిస్థాన్‌లో బాబర్‌ ఆజామ్‌ వంటి మంచి ఆటగాళ్లే ఉన్నప్పటికీ వారు భారత్‌లో ఎప్పుడూ ఆడరు. అందులోనూ గతంలో హైదరాబాద్‌లో ఆడినవారు ఎవరూ లేరు. న్యూజిలాండ్‌లోనే ఒకరిద్దరు ఉన్నారు. అర్హత టోర్నీలో గెలిచి వచ్చే జట్లలో పెద్ద ఆటగాళ్లు ఉండటం కష్టమే! కనీసం అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ పెట్టినా బాగుండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రషీద్‌ ఖాన్‌ వంటి క్రికెటర్ల ఆటను ఆస్వాదించేవాళ్లమని అనుకుంటున్నారు.


వన్డే ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచులను హైదరాబాద్‌లో నిర్వహించడం కాస్త ఊరట. అప్పుడైనా భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ మధ్య సన్నాహక పోరాటాలు చూసేందుకు అవకాశం దొరుకుతుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial


ఈ వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య హోదాలో టీమ్‌ఇండియాకు నేరుగా చోటు దక్కింది. మిగిలిన ఏడు జట్లు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌ నుంచి అర్హత సాధించాయి. మరో రెండు జట్లు జింబాబ్వేలో జరుగుతున్న క్వాలిఫయర్స్‌లో విజయం సాధించి చేరుకుంటాయి. మొత్తం 45 లీగు, 3 నాకౌట్‌ మ్యాచులు ఉంటాయి. అహ్మదాబాద్‌లో ఫైనల్‌ ఉంటుంది. కోల్‌కతా, ముంబయి ఒక్కో సెమీస్‌కు ఆతిథ్యం ఇస్తాయి.