ICC Cricket World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను న్యూజిలాండ్ ఘోరంగా ఓడించింది. రచిన్ రవీంద్ర (97: 72 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్), మార్క్ చాప్‌మన్‌ (65 నాటౌట్: 41 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) తుఫాను బ్యాటింగ్‌తో న్యూజిలాండ్... పాక్ ఇచ్చిన 346 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 43.4 ఓవర్లలోనే సాధించింది. 


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (103: 94 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌద్ షకీల్ (75: 53 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) చెలరేగడంతో న్యూజిలాండ్‌కు 346 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ చేసిన ఈ భారీ లక్ష్యం న్యూజిలాండ్ ముందు ఏమాత్రం సరిపోలేదు. కివీస్‌ తరఫున రచిన్‌ రవీంద్ర అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అయితే సెంచరీ మిస్సయ్యాడు. ఇది కాకుండా మార్క్ చాప్‌మన్ కూడా వేగంగా పరుగులు చేశాడు.


కాన్వే డకౌట్ అయినా...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 345 పరుగుల భారీ స్కోరు చేయగా, న్యూజిలాండ్ తమ రెండో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. దీని తర్వాత దాదాపు 6 నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర స్కోరును పెంచే బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 179 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 


కేన్ విలియమ్సన్ (54 రిటైర్డ్: 50 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాక రిటైర్ అయ్యాడు. అనంతరం వచ్చిన డారిల్ మిచెల్ (59 రిటైర్డ్: 57 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కూడా కేన్ విలియమ్సన్ తరహాలోనే హాఫ్ సెంచరీ చేసి రిటైర్ అయ్యాడు. విధ్వంసకర బ్యాటింగ్‌ చేసిన రచిన్ రవీంద్ర సెంచరీ చేయడంలో మిస్సయ్యాడు. 72 బంతుల్లో 97 పరుగులు చేసి ఔటయ్యాడు.


మార్క్ చాప్‌మన్ మెరుపు బ్యాటింగ్
రచిన్ రవీంద్ర ఔటైన తర్వాత, మిచెల్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కమ్‌బ్యాక్ చేస్తుందని అనిపించింది. కానీ మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్ (33: 21 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) దీనిని జరగనివ్వలేదు. మార్క్ చాప్‌మన్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. కాగా నీషమ్ 21 బంతుల్లో 33 పరుగులు చేశాడు. నీషమ్ బ్యాట్ నుంచి 3 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి. అయితే అతను విజయానికి చేరువలో ఔటయ్యాడు.










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial