ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ రోహిత్‌ సేన ఘన విజయాలు సాధించింది. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆరంభంలో కాస్త తడబడ్డా తర్వాత పుంజుకుని గెలుపు సాధించింది. అఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పూర్తిగా ఏకపక్ష విజయాలు సాధించి.. సెమీస్‌ దిశగా పయనిస్తోంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు ఈ నెల 22న పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రోహిత్‌ సేన బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. కానీ భారత క్రికెట్‌ దిగ్గజం, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్ మాత్రం ఇద్దరు బ్యాటర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రపంచకప్‌ కైవసం దిశగా సాగుతున్న వేళ పొరపాట్లకు తావు ఇవ్వద్దంటూ సూచిస్తున్నాడు.


బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్ అవుటైన తీరుపై సునీల్‌ గవాస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు వికెట్లను అనవసరంగా పారేసుకున్నారని పెదవి విరిచాడు. శ్రేయస్ అయ్యర్ సహనం కోల్పోయి.. అనవసరంగా వికెట్‌ ఇచ్చాడని మండిపడ్డాడు. శుభమన్ గిల్ కూడా అలాగే వికెట్‌ ఇచ్చాడని అన్నాడు. శ్రేయస్‌, గిల్‌ చేసిన తప్పును విరాట్‌ కోహ్లీ ఎప్పుడూ చేయడని.. కోహ్లీ చాలా అరుదుగా తన వికెట్‌ను పారేసుకుంటాడని వ్యాఖ్యానించాడు. కోహ్లీ వికెట్‌ కోసం బౌలర్లు చాలా శ్రమించాల్సి ఉంటుందని.. అతను అంత తేలిగ్గా సహనం కోల్పోడని గవాస్కర్‌ ప్రశంసించాడు. కోహ్లీ 70, 80 పరుగులకు చేరుకున్నప్పుడు వందకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తాడని, అప్పటి నుంచి తన వికెట్‌ను మరింత జాగ్రత్తగా కాపాడుకుంటాడని విశ్లేషించాడు. అలా చేస్తేనే భారీ స్కోర్లు చేయవచ్చని లిటిల్‌ మాస్టర్‌ తెలిపాడు. 


శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్‌ సెంచరీలకి ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలన్న గవాస్కర్‌.. వారిద్దరికి అది చాలా ముఖ్యమన్నారు. శుభమన్ గిల్‌, అయ్యర్‌ ఇద్దరూ శతకాలు సాధించడం లేదని, వీరిద్దరూ భారత టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నారని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గవాస్కర్‌ సూచించాడు. అవకాశాలను వదులుకుంటే మళ్లీ రావని కూడా హెచ్చరించాడు. 


భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. బౌలర్లు సమష్టి ప్రదర్శన... బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు ఎదురేలేకుండా పోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో.. రోహిత్ సేన ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో మెరిశాడు. అయితే ఈ సెంచరీతో క్రికెట్‌ గాడ్ సచిన టెండూల్కర్‌ రికార్డుకు మరింత చేరువయ్యాడు. మరొక్క సెంచరీ చేస్తే వన్డేల్లో సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. క్రికెట్ లెజెండ్‌ సచిన్ 463 వన్డేల్లో 49 శతకాలు చేయగా.. కోహ్లీ 285 మ్యాచ్‌ల్లోనే 48 శతకాలు పూర్తి చేసుకున్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్‌ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. బంగ్లాదేశ్‌పై శతకంతో వన్డేల్లో సచిన్‌ తెందూల్కర్‌ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డుకు విరాట్‌ మరింత చేరువగా వచ్చాడు.