భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహాత జైత్రయాత్ర కొనసాగుతోంది. బౌలర్లు సమష్టి ప్రదర్శన... బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు ఎదురేలేకుండా పోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో.. రోహిత్ సేన ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో మెరిశాడు. అయితే ఈ సెంచరీతో క్రికెట్‌ గాడ్ సచిన టెండూల్కర్‌ రికార్డుకు మరింత చేరువయ్యాడు. మరొక్క సెంచరీ చేస్తే వన్డేల్లో సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. క్రికెట్ లెజెండ్‌ సచిన్ 463 వన్డేల్లో 49 శతకాలు చేయగా.. కోహ్లీ 285 మ్యాచ్‌ల్లోనే 48 శతకాలు పూర్తి చేసుకున్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్‌ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. బంగ్లాదేశ్‌పై శతకంతో వన్డేల్లో సచిన్‌ తెందూల్కర్‌ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డుకు విరాట్‌ మరింత చేరువగా వచ్చాడు. 


అత్యధిక పరుగుల్లో నాలుగో స్థానానికి...
 మరోవైపు బంగ్లాదేశ్‌పై శతకంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనెను విరాట్‌ అధిగమించాడు. మహేల జయవర్ధనే 25 వేల 957 పరుగులతో  ఉండగా కోహ్లీ 26 వేల 26 పరుగులతో జయవర్ధనేను అధిగమించి నాలుగో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో సచిన్ 34,357 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. కుమార సంగక్కర 28,016 పరుగులతో రెండో స్థానంలో... రికీ పాంటింగ్ 27,483 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పుడో కోహ్లీ నాలుగో స్థానాన్ని ఆక్రమించగా... మహేలా జయవర్ధనె ఐదో స్థానంలో ఉన్నారు.


కోహ్లీ సెంచరీ ఊహించనిదే
 బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ అసలు అభిమానులు ఎవ్వరూ ఊహించలేదు. జట్టు స్కోరు 231 ఉన్నప్పుడు అతడి స్కోరు 74. ఆ సమయంలో విజయానికి కావాల్సిన పరుగులన్నీ కోహ్లీనే చేసి శతకాన్ని సాధించాడు. సూపర్‌ ఫామ్‌ను కొనసాగించిన కోహ్లీ (103 నాటౌట్‌; 97 బంతుల్లో 6×4, 4×6) సెంచరీతో చెలరేగాడు. అలవోకగా బ్యాటింగ్‌ చేస్తూ బంగ్లాకు ఏమాత్రం ఒత్తిడి తెచ్చే అవకాశం ఇవ్వలేదు. హసన్‌ మహమూద్‌ బౌలింగ్‌లో మిడాన్‌లో ఫోర్‌, అతడి తలమీదుగా సిక్స్‌ కొట్టిన కోహ్లి.. ఆ తర్వాత ఎన్నో సింగిల్స్‌ తీశాడు. 


ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 256 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయసంగా ఛేదించింది. తొలుత రోహిత్‌, గిల్‌.. విజయానికి గట్టి పునాదీ వేయగా... కోహ్లీ పనిని పూర్తి చేశాడు. అ‌ద్భుత శతకంతో కోహ్లీ టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు. సిక్స్‌తో ఇటు భారత జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు కోహ్లీ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో విరాట్‌ 103 పరుగులు చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ 97 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. నౌషమ్‌ అహ్మద్‌ వేసిన 41 ఓవర్‌ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి కింగ్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 41 ఓవరల్లో కేవలం మూడు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది.