ప్రపంచకప్‌లో టీమిండియా విజయాల జైత్రయాత్ర కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ రోహిత్‌ సేన మరో ఏకపక్ష విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయసంగా ఛేదించింది. తొలుత రోహిత్‌, గిల్‌.. విజయానికి గట్టి పునాదీ వేయగా... కోహ్లీ పనిని పూర్తి చేశాడు. అ‌ద్భుత శతకంతో కోహ్లీ టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు. సిక్స్‌తో ఇటు భారత జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు కోహ్లీ శతకం కూడా పూర్తి చేసుకున్నాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో విరాట్‌ 103 పరుగులు చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ 97 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. నౌషమ్‌ అహ్మద్‌ వేసిన 41 ఓవర్‌ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి కింగ్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి  బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 41 ఓవరల్లో కేవలం మూడు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. 

 

బంగ్లా కట్టడి

బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై బంగ్లాదేశ్‌ను 256 పరుగులలోపు కట్టడి చేసింది. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లా 256 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా పులులకు.. అదిరే ఆరంభం లభించింది. బంగ్లా ఓపెనర్లు తన్జీద్‌ హసన్‌, లిట్టన్‌ దాస్‌ అద్భుత ఆరంభం అందించారు. 14 ఓవర్ల వరకూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ జంట తొలి వికెట్‌కు 93 పరుగులు సాధించి భారీ స్కోరుకు బాటలు వేసింది. టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట.... ఆచితూచి ఆడుతూ సమయం చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును నడిపించింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్‌ యాదవ్‌ విడగొట్టాడు. 43 బంతుల్లో 3 సిక్సులు, 5 ఫోర్లతో ధాటిగా ఆడుతున్న తన్జీద్‌ హసన్‌ను కుల్దీప్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 93 పరుగుల వద్ద బంగ్లా తొలి వికెట్‌ కోల్పోయింది. తన్జీద్‌ హుస్సేన్‌ అవుటైనా లిట్టన్‌ దాస్‌ క్రీజులో పాతుకుపోయాడు. సహజ శైలికి విరుద్ధంగా భారత బౌలర్లు ఆచితూచి ఆడాడు.

 

ఓవైపు లిట్టన్‌ దాస్‌ నిలబడినా ఇవతలి పక్క వికెట్లు పడుతూ వచ్చాయి. 93 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన బంగ్లా 110 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.  ఎనిమిది పరుగులు చేసిన శాంటోను రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఎల్డీడబ్య్లూ రూపంలో శాంతో వెనుదిరిగాడు. అనంతరం హసన్‌ మిరాజ్‌ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. సిరాజ్ బౌలింగ్‌లో కీపర్‌ రాహుల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో హసన్‌ మిరాజ్‌ అవుటయ్యాడు. సిరాజ్‌ బంతి లెగ్‌ సైడ్‌ వెళ్తుండగా అది కీపర్‌ వైపు వెళ్లింది. అద్భుతంగా డైవ్‌ చేస్తూ రాహుల్‌ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. కేవలం మూడు పరుగులకే హసన్‌ మిరాజ్‌ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం 16 పరుగులు చేసిన హ్రిడోయ్‌ను శార్దూల్‌ ఠాకూర్‌ అవుట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ 137 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ముష్పికర్‌ రహీమ్, మహ్మదుల్లా బంగ్లా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ 42 పరుగుల భాగస్వామ్యంతో బంగ్లాను ముందుకు నడిపించారు. 46 బంతుల్లో 38 పరుగులు చేసిన ముష్పికర్‌ రహీమ్‌ను బ్రుమా వెనక్కి పంపండంతో వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. 66 పరుగులు చేసిన లిట్టన్‌ దాస్‌ను జడేజా వెనక్కి పంపాడు. 

 

వరుసగా వికెట్లు పడుతున్నా కానీ మహ్మదుల్లా పోరాటాన్ని ఆపలేదు. ఒంటరి పోరాటం చేస్తూ బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.  నౌషమ్ అహ్మద్‌ అండతో చివరి ఓవర్లలో మహ్మదుల్లా కీలకమైన పరుగులు సాధించాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు చేసిన మహ్మదుల్లాను అద్భుత యార్కర్‌తో ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో బుమ్రా బౌల్డ్‌ చేశాడు.

 

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు నేలకూల్చాడు. కుల్దీప్‌ యాదవ్‌ 10 ఓవర్ల బౌల్‌ చేసి 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ 1, మహ్మద్‌ సిరాజ్‌ 2 , బుమ్రా 2,  వికెట్‌ తీశారు.

 

విరాట్‌ విశ్వరూపం

 

అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 12 ఓవర్లలోనే 88 పరుగులు చేసి విజయానికి బాటలు వేశారు. రోహిత్‌ శర్మ 40 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుటయ్యాడు. గిల్‌ 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత కింగ్‌ కోహ్లీ టీమిండియాను విజయం దిశగా నడిపించాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న విరాట్‌.... అద్భుత శతకంతో విశ్వరూపం చూపాడు. సిక్స్‌ కొట్టి భారత్‌ను విజయాన్నిఅందించడంతో పాటు శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శ్రేయస్స్ అయ్యర్‌ 19 పరుగులు చేసి అవుటయ్యాడు. రాహుల్‌ 34 పరుగులతో కోహ్లీకి మంచి సహకారం అందించాడు. టాపార్డర్‌ బ్యాటర్లు అందరూ రాణించడంతో భారత్‌ మరో విజయాన్ని అందుకుంది.  

 

హార్దిక్‌కు గాయం

 

బౌలింగ్‌ వేస్తున్న సమయంలో మోకాలి నొప్పితో బాధపడుతూ హార్దిక్ పెవిలియన్‌కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మూడో బంతిని ఆపే క్రమంలో కాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడు. మూడు బంతులు వేసిన హార్దిక్‌ మోకాలి నొప్పితో బాధ పడుతూ మైదానాన్ని వీడాడు.  ఆ తర్వాతి మూడు బంతులను కింగ్‌ విరాట్‌ కోహ్లీ పూర్తి చేశాడు.