ICC Equal Prize Money: పేరుకు క్రికెట్‌ను పురుషులతో పాటు మహిళలూ ఆడుతున్నా వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. మెన్స్ క్రికెటర్లతో పాటు ఉమెన్స్ క్రికెటర్లకు సమానంగా  వేతనాలు అందడం లేదు. కొన్నాళ్లుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా,  ఇండియా వంటి దేశాలు  ఆ దిశగా ముందడుగు వేయగా  దానిని స్ఫూర్తిగా ఐసీసీ.. ఇకనుంచి ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో   పురుషులు, మహిళలకు ఒకే విధమైన ప్రైజ్ మనీ అందనుంది.  


ఈ మేరకు ఐసీసీ   డర్బన్ వేదికగా  ముగిసిన  వార్షిక సమావేశంలో  కీలక నిర్ణయం తీసుకుంది.  ఇకనుంచి ఐసీసీ నిర్వహించే  వన్డే, టీ20 ప్రపంచకప్‌లతో పాటు  అండర్ - 19 వరల్డ్ కప్ ఈవెంట్స్‌లో కూడా  పురుషులతో పాటు మహిళల జట్లకూ సమానంగా  ప్రైజ్ మనీ అందనుంది. ఇదే విషయమై  ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ.. ‘క్రికెట్ చరిత్రలో ఇది ముఖ్యమైన ఘట్టం.  ఇకనుంచి ఐసీసీ ఈవెంట్లలో పోటీపడే  పురుషుల క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకూ  ప్రైజ్ మనీ అందిస్తాం..’ అని తెలిపాడు. 


 






వాస్తవానికి ఐసీసీ.. 2030 నాటికి  పురుషులు, మహిళల క్రికెటర్ల ప్రైజ్ మనీ విషయంలో సమానత్వం సాధించాలని గతంలో లక్ష్యంగా పెట్టుకుంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఐసీసీ ఈ లక్ష్యాన్ని అందుకోవడం విశేషం. ‘2017 నుంచి మేం  ఐసీసీ ఉమెన్ ఈవెంట్స్‌లో ప్రైజ్ మనీని క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాం. ఇకనుంచి ఐసీసీ ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచే ప్రైజ్ మనీనే ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచే టీమ్‌కూ దక్కనుంది. ఇదే.. టీ20 వరల్డ్ కప్స్, అండర్ - 19 స్థాయిలకూ వర్తించనుంది..’ అని ఐసీసీ  ప్రకటనలో వెల్లడించింది.


నవ శకానికి నాంది : జై షా 


ఐసీసీ ప్రకటించిన  ఈక్వల్ ప్రైజ్ మనీపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించాడు.  ‘లింగ సమానత్వం, సాధికారత కోసం కీలకమైన ముందడుగు పడింది. ఇకపై ఐసీసీ ఈవెంట్స్‌లో పాల్గొనబోయే పురుషలు, మహిళా జట్లకు ఒకే రకమైన ప్రైజ్ మనీ అందనుంది. ఇందుకు సహకరించిన అందరు బోర్డు సభ్యులకు  ధన్యవాదాలు. కలిసికట్టుగా పనిచేసి క్రికెట్‌ను  ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేసే విధంగా పాటుపడదాం..’ అని  ట్వీట్ చేశాడు. 


 






క్రికెట్‌లో దీనిని ఇప్పుడిప్పుడే  తీసుకొచ్చిన  టెన్నిస్‌లో మాత్రం కొన్నేళ్ల క్రితం నుంచే అమలుచేస్తున్నారు. గ్రాండ్ స్లామ్ టోర్నీలలో  పురుషులు, మహిళలకు  సమాన ప్రైజ్ మనీ అందుతున్నది. ఇక ఐసీసీ చెప్పినట్టు ఇది కూడా అమలైతే మహిళా క్రికెట్‌కు మరింత క్రేజ్ పెరగనుంది. 































Join Us on Telegram: https://t.me/abpdesamofficial