Making Of WTC Mace: క్రికెట్ అభిమానులను టెస్ట్ సమరంలో ముంచెత్తడానికి భారత్ - ఆస్ట్రేలియాలు ఓవల్ వేదికగా హోరాహోరి తలపడుతున్నాయి.  ఫైనల్ లో నెగ్గిన వారికి భారీ  నగదు బహుమతితో పాటు ఐసీసీ ప్రత్యేకంగా ‘గద’ను కూడా అందజేస్తుంది. అసలు ఏంటీ గద కథ..?   ఐసీసీ ఏ  మేజర్ టోర్నీలో అయినా  అందజేసే ట్రోఫీకి దీనికి తేడా ఏంటి..?  ఈ గదను ఎవరు తయారుచేస్తారు..? మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది..? వంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం. 


ఆలోచన పుట్టిందక్కడ.. 


ప్రస్తుతం అందజేస్తున్న గదకు గత చరిత్ర ఘనంగానే ఉంది.  2000 సంవత్సరం నుంచే ఐసీసీ దీనిని అందజేస్తున్నది.   ట్రావెర్ బ్రౌన్ అనే ప్రఖ్యాత డిజైనర్ దీనిని రూపొందించాడు.  ఈ గదను తయారుచేయడానికి ఆయనను స్ఫూర్తినిచ్చిన  మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఒక క్రికెట్ మ్యాచ్ చూశాకే ఆయనకు ఈ ఆలోచన పుట్టిందట.. ఇదే విషయమై ఆయన  స్పందిస్తూ.. ‘నేను ఓసారి  ఉత్కంఠగా సాగిన  మ్యాచ్ ను చూశాను.  ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సభ్యులు  స్టంప్ తీసుకుని   సంబురాలు చేసుకున్నారు.  ఆ దృశ్యం నన్ను బాగా ఆకర్షించింది.  దాని స్ఫూర్తిగానే గద తయారీ ఆలోచన పుట్టింది’ అన్నాడు. 


క్రికెట్‌లో ప్రధానమైన బంతిని కేంద్ర బిందువుగా చేసుకుని దీనిని రూపొందించారు. బంతికి స్టంప్ ఆకారంలో ఉండే  హ్యాండిల్‌ను అమర్చారు. స్టంప్ కింది భాగంలో ఉన్నట్టుగానే  గద హ్యాండిల్‌కు కూడా కింద ఆకృతి మొన ఆకారంలో ఉంటుంది.  పైన భాగంలో బంతి పైన భూగోళం  మ్యాప్‌ను అమర్చారు. ఇది టెస్టు క్రికెట్ ప్రపంచ స్థాయిని తెలియజేస్తుంది. హ్యాండిల్ చుట్టూ ఉండే రిబ్బన్ ను విజయానికి చిహ్నాంగా సూచిస్తారు. 


 






డిజైన్.. 


గదలోని ప్రధానభాగాలైన బంతి ఆకారంలో ఉండే రూపంతో పాటు పొడవాటి స్టంప్  రూపంలో ఉండే  హ్యాండిల్‌ను  వెండితో తయారుచేస్తారు. బంతి ఆకారంలో ఉండేదానిపై ప్రపంచదేశాల (గ్లోబ్ మ్యాప్) గుర్తులకు మాత్రం బంగారపు పూత పూస్తారు.  ఇక  హ్యాండిల్ కింది భాగంలో ఉండే మొనను  హార్డ్ వుడ్‌తో తయారుచేస్తారు. బంతి ఆకారంలో మధ్యలో కొన్ని బాక్సులను ఏర్పాటు చేసి అందులో క్రికెట్ ఆడే దేశాల  చిహ్నాలను అమరుస్తారు.  వీటికి కూడా బంగారు పూత పూస్తారు. 


ట్రోఫీకి దీనికి తేడాలేంటి..? 


మామూలుగా అయితే ఐసీసీ నిర్వహించే  వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్‌ ట్రోపీలు  పట్టుకోవడానికి వీలుగా రెండు హ్యాండిల్స్ ఉంటాయి. అంతేగాక ఆ హ్యాండిల్స్ ‌కు  కింద బాగంలో  సపోర్ట్  కూడా ఉంటుంది. కానీ గద అలా కాదు. బంతి ఆకారంలో చుట్టూ ఉండే పంజరం మాదిరిగా ఉండి  దానికి  వరల్డ్ మ్యాప్ అంటించబడి ఉంటుంది. ఇది తయారుచేయడం అత్యంత క్లిష్టమైన విషయం అని చెబుతున్నాడు ఈ  గద తయారీలో పాలు పంచుకున్న లీ బుల్. 


దీనిని  ఏ మిల్లులోనూ, ఫ్యాక్టరీలోనూ ప్రత్యేక మిషన్స్  పెట్టి తయారుచేయరు.  పాలిషింగ్ చేసేందుకు చిన్న చిన్న మిషన్స్ తప్ప మెయిన్ వర్క్ అంతా చేతులమీదుగానే చేస్తారని  లీ బుల్ చెప్పాడు.  బంతి ఆకారంలో ఉన్న గ్లోబుపై  ఉండే చిన్న రాడ్స్‌ను వంచడానికి, వాటిపై గ్లోబ్ మ్యాప్ ను అతికించేందుకు వీలుగా  వాటిని  700 డిగ్రీల సెల్సియస్ డిగ్రీలలో వేడి చేస్తారు. 


 






ప్రధాన టోర్నీలకు ట్రోఫీలు వీళ్లవే.. 


థామస్ లైట్ ఇంగ్లాండ్‌లోనే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన   గోల్డ్, సిల్వర్ ఆకృతులను తయారుచేసే సంస్థ. ఫుట్‌బాల్ లో నిర్వహించే  ఫిఫా,  ఎఫ్ఎ కప్, ఛాలెంజర్స్ కప్, టెన్నిస్ టోర్నీలతో పాటు ఐసీసీ నిర్వహించే టోర్నీలకు థామస్ లైట్  ట్రోఫీలను రూపొందిస్తుంది. ఐసీసీ, ఇతర క్రీడా సంస్థలు అందించే అవార్డులను రూపొందించేది కూడా ఈ సంస్థే కావడం విశేషం.