Hardik Pandya: ప్రపంచ క‌ప్‌లో వ‌రుసపెట్టి ప్రత్యర్థుల‌ను మ‌ట్టిక‌రిపిస్తున్న టీమిండియాకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప్రపంచ కప్‌ కలను సాకారం చేసుకునేందుకు రెండడుగుల దూరంలో నిలిచిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ గాయం కారణంగా దూరమవ్వడం... భారత జట్టును కలవరపరుస్తోంది. లీగ్‌ మ్యాచుల్లో అప్రతిహాత జైత్రయాత్ర సాగించిన రోహిత్ సేనకు అసలు సవాల్‌ నాకౌట్‌లో ఎదురుకానుంది. ఇప్పటివరకూ బ్యాటర్లు మెరుగ్గా రాణించడం.. బౌలర్లు అదరగొట్టడంతో అసలు ఓటమన్నదే లేకుండా టీమిండియా ముందుకు సాగుతోంది. కానీ నాకౌట్‌లో ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఇలాంటి సమయంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుకు దూరం కావడం టీమిండియాపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. 


హార్దిక్‌ పాండ్యా గాయంతో దూరమవ్వడం కీలక సమయంలో రోహిత్‌ సేనకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే. ఎందుకంటే భారత జట్టులో ఉన్న నాణ్యమైన పేస్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఒక్కడే. బ్యాట్‌తోనే కాక బంతితోనూ పాండ్యా తన వంతు పాత్రను సమర్థంగా పోషించగలడు. వికెట్ల త్వరగా పడితే నిలబడి సమర్థంగా ఆచితూచి ఆడే సామర్థ్యంతో పాటు చివర్లో విధ్వంసకర బ్యాటింగ్‌ చేయగల సత్తా పాండ్యా సొంతం. బౌన్సర్లతో బ్యాటర్లను పాండ్యా ముప్పుతిప్పలు కూడా పెట్టగలడు. టీమిండియాలో ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగితే మూడో సీమర్‌ పాత్రను పాండ్యా నిర్వర్తించి జట్టు సమతుల్యతను కాపాడుతాడు. కానీ ఇప్పుడు జట్టు సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. లీగ్‌ మ్యాచుల్లో భారత్‌ సాధికార విజయాలు సాధించడంతో అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా నాకౌట్‌లో పరిస్థితి అలా ఉండకపోవచ్చు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాండ్యా సమర్థంగా ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి మెగా టోర్నీలో ఆల్‌రౌండర్‌గా జట్టుకు పాండ్యా సేవలు చాల ముఖ్యమన్నది నిర్వివాద అంశం. లీగ్‌ దశలో టీమిండియా రెండు నామమాత్రపు మ్యాచ్‌లు  మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే, సెమీస్‌లో మాత్రం హార్దిక్‌ పాండ్యా లాంటి కీలక ఆల్‌రౌండర్‌ సేవలు కోల్పోవడం అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. ఫీల్డింగ్‌లో కూడా పాండ్యా చాలా చురుగ్గా కదులుతాడు. ఇవన్నీ టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం స్పష్టం కనిపిస్తుంది. 
బ్యాటింగ్‌, బౌలింగ్‌లో భారత్‌ దుర్భేద్యంగా కనిపిస్తున్నా ఇలాంటి మెగా టోర్నీల్లో ప్రత్యర్థి జట్లను అంత తేలిగ్గా తీసుకోవడం కుదరదు. వరుసగా వికెట్లు పడ్డప్పుడు పాండ్యా లాంటి ఆటగాడిని ఏ జట్టైనా కోరుకుంటుంది. పాండ్యా జట్టులో ఉంటే బ్యాటింగ్‌ పరంగా.. బౌలింగ్‌ పరంగా భారత్‌కు ఒక ఆటగాడు ఎక్కువ ఉన్నట్లే లెక్క. ఎవరైనా బౌలర్‌ లయ తప్పితే ఆ స్థానాన్ని పాండ్యాతో భర్తీ చేయవచ్చు. అలా కాకుండా స్పెషలిస్ట్‌ బౌలర్‌నో... స్పెషలిస్ట్‌ బ్యాటర్‌నో తీసుకుంటే వాళ్లు కేవలం అదే విభాగానికి పరిమితం అవుతారు. ఇదీ జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ , ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణిస్తూ టీమిండియా విజయాల్లో హార్దిక్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో బ్యాట్‌తో ఇంకా మెరుపులు మెరిపించనప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం హార్దిక్ రాణించాడు. ఈ విషయాలను అంచనా వేస్తే తెలుస్తుంది పాండ్యా టీమిండియాకు ఎంత కీలకమో...


ఇప్పటికే హార్దిక్‌ పాండ్యా గాయం వల్ల దూరం అయిన మ్యాచుల్లో జట్టు సమతుల్యత దెబ్బతిని, ఫైనల్‌ 11పై అనేక సందేహాలను లేవనేత్తింది. పాండ్యా లేకపోవడంతో భారత జట్టు తమ లైనప్‌లో కొన్ని మార్పులు చేసింది. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచుల్లో తొది జట్టులోకి సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీలను తీసుకున్నారు. మొదటి నాలుగు మ్యాచ్‌లకు బెంచ్‌పై ఉన్న షమీ, న్యూజిలాండ్‌పై ఐదు వికెట్లు పడగొట్టడం, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. కానీ ధర్మశాల వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. హార్దిక్ లేకపోవటంతో కివీస్‌తో మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతోనే టీమిండియా ఆడాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ తొలుత భారీగా పరుగులు ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో పాండ్యా ఉంటే రోహిత్‌కు బౌలింగ్‌ మార్పు చేసే అవకాశం ఉండేది. కానీ ఆరో బౌలర్ లేకపోవటంతో రోహిత్... కుల్దీప్‌నే కొనసాగించాల్సి వచ్చింది.  అదే పాండ్యా ఉంటే ఎవరైనా బౌలర్‌ లయ అందుకోకపోతే బౌలింగ్‌ మార్పుగా హార్దిక్‌ను దించే అవకాశం జట్టుకు ఉంటుంది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.


నాకౌట్‌లో జట్టు లయ దొరికి ఎలాంటి అవంతరాలు లేకుండా భారత జట్టు ముందుకు సాగితే పాండ్యా గాయం గురించి అందరూ మర్చిపోతారు. కానీ క్లిష్ట పరిస్థితులు ఎదురైతే మాత్రం అందరిచూపు మళ్లీ పాండ్యా వైపే ఉంటుంది.