Happy Birthday Virat: ఆధునిక క్రికెట్ లో మనం ఇటీవల కాలంలో తరచుగా విన్న పదం ఫ్యాబ్ 4. విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ ను కలిపి ఫ్యాబ్ 4 అనేవారు. వాళ్ల బ్యాటింగ్ స్టామినా, రికార్డులు అన్నీ చూసి ఈ తరం బ్యాటర్లలో వాళ్ల మధ్యే అసలైన పోటీ అని అంతా భావించేవాళ్లు. ఇప్పుడు ఈ పదం వినడం దాదాపుగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పటిలా విరాట్ కోహ్లీలా 3 ఫార్మాట్లలోనూ మిగతా ముగ్గురూ నిలకడగా ఆడడంలేదు. దాదాపు గత మూడేళ్ల నుంచి కోహ్లీ కూడా ఫామ్ కోల్పోయాడు. అయితే వారిలా మరీ దారుణం కాదు. ప్రస్తుత ప్రపంచకప్ లో మునుపటి విరాట్ ను తలపిస్తూ రెచ్చిపోతున్నాడు. GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అనే పదానికి అసలైన అర్ధం చెప్తున్నాడు. నేడు తన 34వ పుట్టినరోజు సందర్భంగా కోహ్లీ కెరీర్ లో ముఖ్యమైన ఘట్టాలు ఏంటో తెలుసుకుందాం.
1. 133 వర్సెస్ శ్రీలంక, ఫిబ్రవరి 2012
అప్పటికి విరాట్ భారత జాతీయ జట్టులోకి వచ్చి నాలుగేళ్లు అయింది. టాలెంటెడ్ యంగ్ స్టర్, మంచి భవిష్యత్తు ఉంటుందని అందరికీ తెలిసింది. అయితే విరాట్ కోహ్లీని ఛేదన మాస్టర్ ను చేసిన ఇన్నింగ్స్ ఇది. ట్రై సిరీస్ లో ఫైనల్ ఆశలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. బోనస్ పాయింట్ కూడా రావాలంటే 40 ఓవర్లలోనే శ్రీలంక నిర్దేశించిన 321 టార్గెట్ ను ఛేదించాలి. అప్పుడే విరాట్ తన విశ్వరూపం చూపించాడు. సూపర్ ఫాంలో ఉన్న లంక బౌలర్ లసింత్ మలింగ బౌలింగ్ కు దీటుగా బదులిస్తూ 133 పరుగులు చేశాడు. విరాట్ విజృంభణతో 36.4 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. వన్డే చరిత్రలోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్సుల్లో ఒకటిగా నిలిచిపోయింది.
2. 112, 141 వర్సెస్ ఆస్ట్రేలియా, అడిలైడ్ టెస్ట్ 2014
ఈ మ్యాచ్ కు ధోనీ అందుబాటులో లేకపోవటంతో కోహ్లీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పుడే టీమిండియా టెస్ట్ క్రికెట్ కు అటాకింగ్ గేమ్ ను పరిచయం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 115 పరుగులు చేశాడు. కానీ అసలు ఆట రెండో ఇన్నింగ్స్ లోనే. 364 భారీ లక్ష్య ఛేదనలో భారత్ త్వరగానే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో 141 పరుగులు చేసిన కోహ్లీ మురళీ విజయ్ తో కలిసి 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్ 315 పరుగులకు ఆలౌట్ అయ్యి పరాజయం పాలైంది. జట్టు ఓడినప్పటికీ కోహ్లీ అటాకింగ్ ఇన్నింగ్స్ మాత్రం చరిత్రలో ఒకటిగా మిగిలిపోయింది.
3. 2016 ఐపీఎల్, అక్కడ్నుంచి రెండేళ్లు
2016 ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టించాడు. 4 సెంచరీలతో సహా 973 పరుగులు చేశాడు. బహుశా ఇది ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేరేమో. అక్కడ్నుంచి మొదలైన కోహ్లీ దండయాత్ర... అంతర్జాతీయ క్రికెట్ లోనూ కొనసాగింది. సుమారు ఏడాది గ్యాప్ లోనే 6 టెస్ట్ డబుల్ సెంచరీలు బాదేశాడు. 2016, 17 ఈ రెండేళ్లు కోహ్లీ కెరీర్ లోనే అత్యుత్తమ దశగా చెప్పుకోవచ్చు.
4. 2018 ఇంగ్లండ్ పర్యటన
2014 ఇంగ్లండ్ టూర్ లో ఘోర వైఫల్యం తర్వాత విరాట్ ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఆఫ్ స్టంప్ బయట ఇబ్బంది పడతాడని ట్రోలింగ్. కానీ అదే జట్టుపై 2018 పర్యటనలో అన్నింటికీ తన బ్యాట్ తోనే జవాబిచ్చాడు. 5 టెస్టుల్లో 2 సెంచరీలు, 3 అర్థశతకాలతో 593 పరుగులు సాధించాడు. కోహ్లీ కెరీర్ లోనే ఇది బెస్ట్ కంబ్యాక్.
5. 2018-19 ఆసీస్ పై సిరీస్ విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన 4 టెస్టుల సిరీస్ లో 2-1తో ఇండియాను గెలిపించిన కింగ్ కోహ్లీ.. ఆసీస్ గడ్డపై ఆ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్ గా నిలిచాడు. రెండేళ్ల తర్వాత 2020-21 సిరీస్ లో టీమిండియా మళ్లీ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. అప్పుడు కోహ్లీ సిరీస్ మొత్తానికి లేడు కానీ.. అతను అలవాటు చేసిన అటాకింగ్ గేమ్ తోనే భారత్ మళ్లీ సిరీస్ గెలుచుకుంది.
6. 2022 ఆసియా కప్ నుంచి ప్రస్తుత దశ
సుమారు రెండున్నరేళ్ల పాటు ఫాం కోసం, పరుగుల కోసం తంటాలు పడ్డాడు కోహ్లీ. క్రికెట్ నుంచి నెలరోజులు విరామం తీసుకుని ఉత్సాహంగా ఆసియా కప్ లో పాల్గొన్నాడు. ఆ టోర్నీలో తొలి దశలో ఓ మాదిరిగా రాణించిన విరాట్.. అఫ్ఘనిస్థాన్ తో మ్యాచులో సెంచరీ బాదాడు. ఇక అప్పటినుంచి మొదలైంది రెండో విరాట పర్వం. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ లో మునుపటిలా చెలరేగుతున్నాడు. సూపర్- 12 లో పాకిస్థాన్ తో తొలి మ్యాచులో కోహ్లీ ఆడిన తీరును క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. అద్భుత పోరాటంతో ఓటమి అంచున ఉన్న జట్టును గెలిపించాడు. తర్వాత నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ లపైన అర్థశతకాలు బాది ప్రస్తుతం మెగా టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు.
'ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం' అన్న క్రికెట్ నానుడిని నిజం చేస్తూ.. పడిన ప్రతిసారి ఫీనిక్స్ పక్షిలా లేస్తూ తన క్రికెట్ కెరీర్ ను కొనసాగిస్తున్న కింగ్ కోహ్లీకి.. జన్మదిన శుభాకాంక్షలు.