Virat Kohli Birthday: అతను కవర్ డ్రైవ్ ఆడితే కొలత కొలిచినట్లు కరెక్టుగా ఉంటుంది. ఫ్లిక్ షాట్ తో బంతిని బౌండరీకి తరలిస్తే చూడముచ్చటగా అనిపిస్తుంది. బౌలర్ తల మీదుగా బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తే వన్స్ మోర్ అనాలనిపిస్తుంది. ఛేదనలో అతనుంటే స్కోరు బోర్డు మీద ఎన్ని పరుగులున్నా ప్రత్యర్థి జట్టుకు భయమే. ఫీల్డింగ్ చేసేటప్పుడు అతని దగ్గరికి బంతి వెళితే బ్యాట్స్ మెన్ కు వణుకే. అతడెవరంటే.. మాటకు మాట, ఆటకు ఆట అంటూ అగ్రెసివ్ క్రికెట్ తో అభిమానులతో ముద్దుగా కింగ్ అంటూ పిలిపించుకునే విరాట్ కోహ్లీ.
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం, ఛేదన కింగ్... ఈ ఉపమానాలన్నింటికీ ఒక్కటే పేరు. అదే విరాట్ కోహ్లీ. 14 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్న కోహ్లీ.. ఇప్పటికీ అదే ఫాంను కొనసాగిస్తున్నాడు. కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. ఎవరూ బద్దలు కొట్టలేరనుకున్న రికార్డులను ఒక్కొక్కటిగా అందుకుంటూ.. శతకాల మీద శతకాలు బాదేస్తూ.. బౌలర్లకు పీడకలగా మారుతూ.. ఈ తరంలో మేటి క్రికెటర్ గా నిలిచిన విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం
2009 శ్రీలంకతో వన్డే మ్యాచ్. ఆ ముందు ఏడాదే భారత జట్టులో కొచ్చాడు ఒక కుర్రాడు. అప్పటికి శ్రీలంకలో మేటి బౌలర్ గా ఉన్న లసిత్ మలింగ బౌలింగ్ ను ఉతికారేసి సెంచరీ చేశాడు. అప్పుడే తన గురించి క్రికెట్ ప్రపంచానికి ఘనంగా పరిచయం చేసుకున్నాడు ఆ కుర్ర బ్యాట్స్ మెన్. అతనే విరాట్ కోహ్లీ. అండర్- 19 ప్రపంచకప్ గెలిచి జాతీయ జట్టులోకి వచ్చిన కోహ్లీ.. ఆ ఇన్నింగ్స్ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించిన విరాట్.. జట్టు కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో మొత్తం 282 పరుగులు చేశాడు. సచిన్ ను తన ఆరాధ్య క్రికెటర్ గా భావించే కోహ్లీ 2011 లో అతనితో కలిసి ప్రపంచకప్ గెలవడం మరచిపోలేని సంఘటనగా చెప్తుంటాడు. అనంతరం టెస్టుల్లోనూ రాణించి భారత మిడిలార్డర్ కు బ్యాక్ బోన్ గా నిలిచాడు.
కెప్టెన్ గా ఉన్నతి
2013 లో ధోనీ గాయపడటంతో వెస్టిండీస్ సిరీస్ లో కొన్ని మ్యాచులకు కోహ్లీ నాయకత్వం వహించాడు. తర్వాత జింబాబ్వే సిరీస్ కు పూర్తిస్థాయి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అనంతరం ధోనీ నుంచి మూడు ఫార్మాట్లకు సారథిగా పగ్గాలు అందుకున్నాడు. నాయకుడిగా జట్టుకు చాలా సిరీసుల్లో విజయాలు అందించాడు. కోహ్లీ నాయకత్వంలోనే టెస్ట్ క్రికెట్ లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. అగ్రెసివ్ కెప్టెన్సీతో విరాట్ కోహ్లీ టీమిండియాను విజయపథంలో నడిపించాడు. 2016లో కెరీర్ లో అత్యున్నత స్థాయిని అందుకున్నాడు.
శతకాల వీరుడు
ప్రపంచ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేసిన మొనగాడు సచిన్ టెండూల్కర్. ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని విశ్లేషకులు అంచనా వేసిన వేళ.. నేనున్నానంటూ కనిపించాడు విరాట్ కోహ్లీ. శతకాల మీద శతకాలు చేస్తూ సెంచరీల సెంచరీని అందుకునేలా కనిపించాడు. ఇప్పటికే 71 సెంచరీలు విరాట్ ఖాతాలో ఉన్నాయి. ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోకుండా ఉండుంటే ఈపాటికే ఆ మార్కుకు దగ్గరగా వచ్చేవాడే. అయితేనేం గత 2 నెలలుగా మునుపటి ఫామ్ ను కొనసాగిస్తున్న కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొడతాడేమో చూడాలి.
పేలవ ఫామ్ తో సతమతం
విరాట్ కోహ్లీ కెరీర్ లో 2019 నుంచి రెండున్నరేళ్ల కాలం అత్యంత కఠినమైంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్ కు వీడ్కోలు చెప్పేశాడు. బ్యాట్స్ మెన్ గానూ అంతగా రాణించలేదు. పేలవ ఫాంతో ఇబ్బందిపడి జట్టుకు భారమంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే బయటనుంచి ఎన్ని విమర్శలు వచ్చినా జట్టు యాజమాన్యం విరాట్ కు మద్దతుగా నిలిచింది. ఆసియా కప్ కు ముందు నెలరోజులు విరామం తీసుకున్న కోహ్లీ.. ఆ టోర్నీలో బాగా రాణించాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో అయితే మునుపటి కోహ్లీని గుర్తుచేస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో అత్యధిక వీరుడిగా కొనసాగుతున్నాడు.
కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా, ఫీల్డర్ గా క్రికెట్ లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లీ.. ఈ తరంతో పాటు వచ్చే తరానికి ఆదర్శంగా నిలుస్తాడనడంలో సందేహంలేదు. ఈ రోజుతో 34వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విరాట్ కోహ్లీ.. మరెన్నో రికార్డులను తిరగరాయాలని కోరుకుంటూ... కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.