T20 WC 2022 Points Table: పంజరంలో చిలుక ప్రాణాలు మాంత్రికుడి చేతిలో ఉన్నట్టు ఆస్ట్రేలియా సెమీస్‌ ఆశలు చిరకాల శత్రువు ఇంగ్లాండ్‌ చేతిలో ఉన్నాయి! ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సూపర్‌ 12 దశ ఆఖరికి చేరేకొద్దీ సెమీస్‌ సమీకరణాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఒక జట్టు సెమీస్‌ అవకాశాలు ఇంకొకరి గెలుపోటములపై ఆధారపడి ఉన్నాయి.




రన్‌రేట్‌ భయం


టీ20 వరల్డ్‌కప్‌ 2022 గ్రూప్‌ 1 సెమీస్‌ సమీకరణాలు రసవత్తరంగా మారాయి. 7 పాయింట్లు, 2.113 రన్‌రేట్‌తో న్యూజిలాండ్‌ దాదాపుగా సెమీస్‌ కన్ఫామ్‌ చేసుకుంది. మెరుగైన రన్‌రేట్‌ దృష్ట్యా వారిని ఢీకొట్టే జట్టు మరోటి లేదు. శుక్రవారం అఫ్గాన్‌పై గెలుపుతో ఆసీస్‌ రెండో స్థానానికి ఎగబాకింది. 5 మ్యాచుల్లో 3 గెలిచిన ఆ జట్టు 7 పాయింట్లు, -0.173 రన్‌రేట్‌తో ఉంది. ఇప్పుడీ నెగెటివ్‌ రన్‌రేటే ఆతిథ్య జట్టు కొంప ముంచేలా ఉంది. మొదటి మ్యాచులో కివీస్‌ చేతిలో దారుణంగా పరాజయం పాలవ్వడమే ఇందుకు కారణం.


లంక గెలిస్తేనే!


డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా సెమీస్‌ చేరుకోవాలంటే ఇంగ్లాండ్ ఆఖరి మ్యాచులో ఓడిపోవాలి. ప్రస్తుతం ఆంగ్లేయులు 4 మ్యాచులాడి 5 పాయింట్లు, 0.547 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉన్నారు. చివరి పోరులో వీరు లంకేయులతో తలపడుతున్నారు. ఇందులో బట్లర్‌ సేన గెలిచిందంటే కంగారూలు టోర్నీ నుంచి ఔట్‌ అవుతారు. ఎందుకంటే వారికి పాజిటివ్‌ రన్‌రేట్‌తో పాటు 7 పాయింట్లు వస్తాయి. ఒకవేళ లంక గెలిచిందంటే ఆసీస్‌ పంట పండినట్టే.


మరీ టఫ్‌ కాదు!


గ్రూప్‌ 2 సమీకరణాలు సింపుల్‌గానే ఉన్నాయి. టీమ్‌ఇండియా 6 పాయింట్లు, 0.730 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 5 పాయింట్లు, 1.441 రన్‌రేట్‌తో రెండో ప్లేస్‌లో నిలిచింది. వీరిద్దరికీ చెరో మ్యాచ్‌ మిగిలుంది. జింబాబ్వేతో భారత్‌, నెదర్లాండ్స్‌తో సఫారీలు తలపడతారు. ఈ మ్యాచులు గెలిస్తే యథావిధిగా వీరు సెమీస్‌కు వచ్చేస్తారు. ఒకవేళ బంగ్లాపై పాకిస్థాన్‌ గెలిచి, జింబాబ్వే చేతిలో భారత్‌ ఓడిపోతే రన్‌రేట్‌ కీలకం అవుతుంది.