T20 WC 2022: టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశ దాదాపుగా చివరికి వచ్చేసింది. ఇప్పటికే కొన్ని జట్లు 5 మ్యాచులు ఆడేయగా.. మరికొన్ని 4 ఆడాయి. అయినప్పటికీ సెమీస్ కు చేరే జట్లపై పూర్తి స్ఫష్టత లేదు. ఒక జట్టు ఫలితంపై మరొక జట్టు సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుతో పాటు ఆ దేశ అభిమానులు శ్రీలంక గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు జరిగే శ్రీలంక- ఇంగ్లండ్ మ్యాచులో ఇంగ్లండ్ గెలిస్తే నేరుగా సెమీస్ కు చేరుకుంటుంది. అదే లంకేయులు గెలిస్తే ఆసీస్ ముందంజ వేస్తుంది.
లంక గెలిస్తేనే ఆసీస్ ముందుకు
టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్ రేసులో ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. 7 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ కు చేరుకుంది. మిగిలిన రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రేసులో ఉన్నాయి. నిన్న జరిగిన మ్యాచులో అఫ్ఘానిస్థాన్ పై కేవలం 4 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్ సెమీస్ ఆశలు నిలుపుకుంది. ప్రస్తుతం 7 పాయింట్లతో ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. ఈరోజు జరిగే శ్రీలంక- ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితంపై ఆసీస్ సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచులో లంకేయులు గెలిస్తే ఆస్ట్రేలియా సెమీస్ కు వెళుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ జట్టు గెలిస్తే ఆసీస్ ఇంటిదారి పట్టక తప్పదు.
మాకోసం గెలుస్తుంది
అఫ్ఘానిస్థాన్ తో మ్యాచులో అర్థశతకం సాధించిన గ్లెన్ మ్యాక్స్ వెల్ మ్యాన్ ఆఫ్ ధి మ్యాచ్ అందుకున్నాడు. అనంతరం మీడియాతో తమ విజయం గురించి, సెమీస్ లో స్థానం గురించి మాట్లాడాడు. ఈరోజు ఇంగ్లండ్ తో మ్యాచులో తమ కోసమైనా శ్రీలంక గెలవాలని మ్యాక్స్ వెల్ కోరుకున్నాడు. అఫ్ఘనిస్థాన్ చాలా బాగా ఆడిందని.. తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేసిందని మ్యాక్సీ అన్నాడు. ఆ జట్టు బౌలర్లు పవర్ ప్లే, చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులేశారని అన్నాడు. అయితే తాము చివరికి పోరాడే స్కోరు చేశామని చెప్పాడు. బ్యాటింగ్ లోనూ చివరిదాకా పోరాడిందని.. అయితే తమ బౌలర్లు సరైన సమయంలో వికెట్లు తీయడంతో తాము విజయం సాధించామని పేర్కొన్నాడు. ఇక శ్రీలంక తమ కోసమైన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఇంగ్లండ్ పై గెలుస్తుందనే నమ్మకం వ్యక్తంచేశాడు.