Sourav Ganguly Birthday: టీ20 మోజులో పడిన ఈతరం కుర్రాళ్లకు ‘దూకుడు’ కొత్తేం కాకపోవచ్చు గానీ ఒకనాడు భారత క్రికెట్ జట్టు ఈ పదానికి, ఇటువంటి ఆటకూ ఆమడ దూరంలో ఉండేది. జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి ప్రవచించిన ‘అహింసా’ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యేది. కానీ పోటీతత్వం అధికంగా ఉండే క్రికెట్ లో ప్రత్యర్థులు రెచ్చగొట్టినప్పుడు కూడా ‘కామ్’గా ఉంటే కుదరదన్న నాయకుడు గంగూలీ. ‘ఆటకు ఆటతో పాటు మాటకు మాట’ అనడమెలాగో టీమిండియాకు నేర్పించాడు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే తత్వాన్ని వీడి అవతలివాడి రెండు చెంపలు పగలగొట్టేంత ధైర్యాన్ని నూరిపోశాడు. ఇప్పుడు ‘అగ్రెసివ్ అటిట్యూడ్’ అన్న పదానికి దాదా తన హయాంలోనే తాత్పర్యాలు, వివరణలు కూడా ఇచ్చేశాడు. భారత క్రికెట్ అభిమానులు ‘దాదా’ అని పిలుచుకునే గంగూలీ నేడు (జులై 8) 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియాలో దాదా ప్రయాణం..
ఆరంభమే అదుర్స్..
సౌరవ్ చండీదాస్ గంగూలీ భారత క్రికెట్ కు 1992లో ఎంట్రీ ఇచ్చాడు. వన్డేలలో నిలకడైన ఆటతీరు కనబర్చడంతో 1996లో టెస్టు ఎంట్రీ దక్కింది. 1996 జూన్ 20న ఇంగ్లాండ్ వేదికగా లార్డ్స్ లో ఆడిన తొలి టెస్టులోనే దాదా 131 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో దాదా ప్రదర్శన భారత జట్టును ఆ టెస్టులో ఓటమిని తప్పించింది. అప్పటికే వన్డేలలో దూకుడుమీదున్న దాదా.. టెస్టులలో తన స్థానాన్ని ఖాయం చేసుకున్న ఇన్నింగ్స్ అది. ఆ తర్వాత గంగూలీ వెనుదిరిగి చూసుకోలేదు. 1999 వన్డే వరల్డ్ కప్ లో దాదా మెరుగ్గా ఆడాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 158 బంతుల్లోనే 183 పరుగులు సాధించాడు. భారత్ తరఫున వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు.
కెప్టెన్సీ..
2002లో భారత క్రికెట్ ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తర్వాత బీసీసీఐ.. దాదాకు సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఒకరకంగా భారత క్రికెట్ ఇది ఒక ‘ట్రాన్స్ఫర్మేషన్’గా అభివర్ణిస్తారు క్రికెట్ విశ్లేషకులు. భారత క్రికెట్ తీరుతెన్నులను మార్చేశాడు దాదా. రొడ్డకొట్టుడు ‘డిఫెన్సివ్ మోడ్’ నుంచి టీమ్ ను ‘అటాకింగ్ మోడ్’కు మార్చడంలో దాదా కృషి మరువలేనిది. దాదా సారథ్యంలోనే నేడు క్రికెట్ లో దిగ్గజాలుగా వెలుగొందుతున్న మహేంద్రసింగ్ ధోని, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. దాదా సారథ్య హయాంలో భారత్ 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2003 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరింది.
2002లో ఇంగ్లాండ్ లో జరిగిన నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలిచినాక గంగూలీ.. లార్డ్ బాల్కనీ నుంచి షర్ట్ విప్పి సంబురాలు చేసుకున్న సన్నివేశం భారత క్రికెట్ అభిమానులు ఇప్పట్లో మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. స్వదేశాల్లో పులులు విదేశాల్లో మాత్రం తడబడే టీమిండియాకు.. సొంతగడ్డమీదే కాదు ప్రత్యర్థుల సొంతింట్లో విజయాలను అందించిన సారథి గంగూలీ. 1990-2005 వరకూ క్రికెట్ లో అజేయశక్తిగా ఉన్న ఆస్ట్రేలియాకు వెళ్లడమంటేనే ఇతర జట్లు భయపడేవి. కానీ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు.. ఆసీస్ లో ఆసీస్ ను ఓడించి చరిత్ర సృష్టించింది.
అడ్మినిస్ట్రేటర్ గా కూడా..
క్రికెట్ నుంచి తప్పుకున్నాక దాదా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యాడు. 2020లో ప్రపంచ క్రికెట్ పెద్దన్నగా ఉన్న బీసీసీఐని రెండేండ్ల పాటు విజయవంతంగా నడిపించాడు. బీసీసీఐ లో దాదా పీరియడ్ దాదాపు కరోనా కాలంలోనే గడిచిపోయింది. అయినా కూడా 2020లో జనం బయటకు రావడానికి సంకోచిస్తుంటే ఐపీఎల్ లో ‘బయో బబుల్’ విధానం తీసుకొచ్చి విజయవంతంగా నడిపించాడు. దాదా హయాంలోనే ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐ రూ. 47వేల కోట్ల ఆదాయాన్ని గడించింది.
గంగూలీ అభిమానులే గాక క్రికెట్ ఫ్యాన్స్ చాలామంది ఇప్పటికీ ‘దాదా కొంతమందికి నచ్చొచ్చు.. కొంతమంది అతడిని ద్వేషించొచ్చు.. కానీ భారత క్రికెట్ ఉన్నన్నాళ్లూ అతడి లెగసీ మాత్రం కొనసాగుతుంది. అందులో సందేహమే లేదు’ అని చెప్పేవాళ్లే.. దటీజ్ దాదా..