Ganguly on Cricket WC 2023:  ఈ ఏడాది చివర్లో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంటుందని.. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే అందుకోసం నిర్భయంగా ఆడాలని ఆటగాళ్లకు సూచించాడు. 


2013 నుంచి భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకోలేదు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ లు జరిగినప్పటికీ అందులో ఒక్క కప్ ను కూడా అందుకోలేకపోయింది. ఈ పదేళ్ల కాలంలో టీమిండియా ఎన్నోద్వైపాక్షిక సిరీస్ లను గెలుచుకుంది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడికి తలొగ్గి కీలక మ్యాచుల్లో ఓడిపోయి మూల్యం చెల్లించుకుంటోంది. ఈ ఏడాది చివర్లో భారత్ స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఫేవరెట్ అని చాలామంది క్రికెట్ పండితులు, విశ్లేషకులు, మాజీలు అభిప్రాయపడుతున్నారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 


ఇదే జట్టును కొనసాగించాలి


'భారత్ ఎప్పటికీ బలహీనజట్టుగా మారదు. ఇంత ప్రతిభ ఉన్న దేశం బలహీనంగా ఉండదు. భారత్ లో అందుబాటులో ఉన్న సగం మంది ఆటగాళ్లకు కూడా అవకాశం లభించడం లేదు. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన వన్డే సిరీస్ లను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. నేను కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు ఒక సలహా ఇస్తున్నాను. ప్రపంచకప్ వరకు ఈ జట్టునే కొనసాగించండి.' అని గంగూలీ అన్నారు. అలాగే భయం లేని క్రికెట్ ఆడాలని ఆటగాళ్లకు సూచించాడు. 'ప్రపంచకప్ లాంటి టోర్నీలు ఆడుతున్నప్పుడు ఎలాంటి బ్యాగేజ్ లేకుండా ఆడాలి. నిర్భయంగా ఆడాలి. ట్రోఫీ గెలుస్తామా లేదా అనేది ఎక్కువ ఆలోచించకుండా, భయం లేకుండా ఆడాలి.' అని గంగూలీ అన్నాడు.


ఇటీవల వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లపై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ఇలాగే వారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 'శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా ఇంకా ఇలాంటి ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్న దేశం ఎప్పటికీ బలహీన జట్టుగా ఉండదు.' అని గంగూలీ అన్నాడు. 


పంత్ దూరమవడం లోటే. కానీ..


ఈ ఏడాది ఐపీఎల్ నుంచి సౌరవ్ గంగూలీ డిల్లీ క్యాపిటల్స్ జట్టు క్రికెట్ డెైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్ సేవలను తమ జట్టు కోల్పోతుందని గంగూలీ తెలిపారు. అయినా కూడా ట్రోఫీ గెలుచుకునే విధంగా తమ జట్టు ఉందని చెప్పారు. 'ఒక పాత్ర నుంచి మరొక పాత్రకు వెళతున్నాను. దీనికోసం ఎదురుచూస్తున్నాను. రిషభ్ పంత్ లేకపోవడం లోటే. అతను అగ్రశ్రేణి భారత క్రికెటర్. ప్రమాదం వలన అతను దూరమయ్యాడు. దానిగురించి మనమేం చేయలేం' అని గంగూలీ అన్నాడు.