Most Sixes In ODI, Shahid Afridi, Rohit Sharma: 1971 జనవరి 5వ తేదీన వన్డే క్రికెట్ పురుడు పోసుకుంది. ఎందుకంటే మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది అప్పుడు. అప్పటి నుంచి చాలా మంది దిగ్గజ క్రికెటర్లు ఈ ఫార్మాట్‌లో ఆధిపత్యం చెలాయించారు. 1996లో పాకిస్థాన్‌ తరఫున అరంగేట్రం చేసిన షాహిద్ అఫ్రిది ఈ ఫార్మాట్‌ను చాలా ఇష్టపడ్డాడు. 1996 నుంచి 2015 మధ్య 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో అఫ్రిది వన్డేల్లో 351 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటికి వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే.


398 మ్యాచ్‌లు ఆడిన షాహిద్ అఫ్రిది 369 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 730 ఫోర్లు, 351 సిక్సర్లు బాదాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో క్రిస్ గేల్ 331 సిక్సర్లు కొట్టాడు.


రోహిత్ కొడతాడా?
భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 234 వన్డేల్లో 214 ఇన్నింగ్స్‌ల్లో 273 సిక్సర్లు బాదాడు. అఫ్రిది రికార్డును రోహిత్ బద్దలు కొట్టాలంటే... ఈ ఏడాది 88 సిక్సర్లు కొట్టాల్సి ఉంటుంది. ఈ ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. దీంతోపాటు ఈ ఏడాది టీమ్ ఇండియా ఎక్కువ వన్డేలు కూడా ఆడనుంది. అలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ ఈ ఏడాది షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టే అవకాశం అయితే ఉంది.


ప్రస్తుతం వన్డేలు ఆడుతున్న ఆటగాళ్ల అత్యధిక సిక్సర్ల మొనగాళ్లు
రోహిత్ శర్మ - 273 సిక్సర్లు
మార్టిన్ గప్టిల్ - 187 సిక్సర్లు
జోస్ బట్లర్ - 146 సిక్సర్లు
విరాట్ కోహ్లీ - 137 సిక్సర్లు
గ్లెన్ మాక్స్‌వెల్ - 128 సిక్సర్లు
డేవిడ్ మిల్లర్ - 100 సిక్సర్లు


ఇక న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. హోల్కర్‌ స్టేడియంలో సిక్సర్లు, బౌండరీలతో చెలరేగాడు. చాన్నాళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్లో 30వ శతకం అందుకున్నాడు. 2020, జనవరి తర్వాత అతడికిదే తొలి మూడంకెల స్కోరు. గణాంకాల పరంగా ఇది నిజమే. మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్‌ దీనినే ప్రదర్శించగా ఇది యథార్థ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని రోహిత్‌ భావించాడు.


సాధారణంగా రోహిత్‌ శర్మ మీడియా సమావేశాల్లో సరదాగా ఉంటాడు. విలేకరులపై జోకులు వేస్తుంటాడు. అలాంటిది న్యూజిలాండ్‌తో మూడో వన్డే ముగిశాక మాత్రం బ్రాడ్‌కాస్టర్‌పై ఫైర్‌ అయ్యాడు. గణాంకాలను ప్రదర్శించేటప్పుడు యథార్థ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. అతడికి మూడేళ్లలో ఇదే తొలి సెంచరీగా బ్రాడ్‌కాస్టర్ పేర్కొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేర్వేరు కారణాలతో అసలు తాను ఎక్కువగా క్రికెట్ ఆడలేదని వెల్లడించాడు.


'మూడేళ్లలో తొలి సెంచరీ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ మూడేళ్లలో నేను ఆడింది 12 (17) వన్డేలు. మూడేళ్లని చెబితే ఎంతో కాలంగా అనిపిస్తుంది. ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. టీవీల్లో మీరిది చూపించారని నాకు తెలుసు. కానీ యథార్థ పరిస్థితులను మీరు వివరించాలి' అని రోహిత్‌ అన్నాడు. 'హిట్‌మ్యాన్‌' పునరాగమనం చేసిన్టటేనా అని మరో జర్నలిస్టు ప్రశ్నించగా 'నేనింతకు ముందే చెప్పినట్టు 2020లో అసలేం మ్యాచులు లేవు. కొవిడ్‌ 19 వల్ల అందరూ ఇంటివద్దే ఉన్నారు. ఆడిన వన్డేలు చాలా తక్కువ. గాయం కావడంతో రెండే టెస్టులు ఆడాను. మీరు ఆ దృక్పథాన్నీ చూపించాలి' అని రోహిత్‌ పేర్కొన్నాడు.