U-19 womens WC Final:  భారత క్రికెట్ అమ్మాయిల ముందు సువర్ణ అవకాశం. ఐసీసీ టైటిల్ ను చేజిక్కించుకునేందుకు టీమిండియా అండర్- 19 అమ్మాయిలు ఇంకొక్క అడుగు దూరంలో ఉన్నారు. నేడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టుతో భారత అమ్మాయిల జట్టు తడపడనుంది. ఈరోజు సాయంత్రం 5.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 


భారత మహిళల జట్టు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేదు. సీనియర్ల జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్స్ ఫైనల్ వరకు చేరినా.. కప్ మాత్రం కొట్టలేకపోయారు. అయితే ఇప్పుడు జూనియర్లకు ఆ అవకాశం వచ్చింది. ఐసీసీ ట్రోఫీని అందుకునేందుకు వారు ఇంకొక్క అడుగు దూరంలో ఉన్నారు. అండర్- 19 భారత అమ్మాయిల జట్టు నేడు టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లండ్ ను ఢీకొనబోతోంది. ఈ నేపథ్యంలో మన అమ్మాయిల జట్టు బలాబలాలేంటో చూసేద్దామా.. 


బ్యాటింగ్ లో ఆ ఇద్దరు


అండర్- 19 టీ20 ప్రపంచకప్ లో భారత్ తరఫున కెప్టెన్ షెఫాలీ వర్మ, శ్వేత సెహ్రావత్ విశేషంగా రాణిస్తున్నారు. వీరిద్దరూ బ్యాటింగ్ లో అదరగొడుతూ జట్టుకు విజయాలు అందిస్తున్నారు. సీనియర్ జట్టు సభ్యురాలైన షెఫాలీ ఆధ్వర్యంలో  అమ్మాయిల జట్టు ఫైనల్ చేరుకుంది. బౌలింగ్ లో పర్శవి చోప్రా, తితాస్, మన్నత్ కశ్యప్ మంచి ఫాంలో ఉన్నారు. వీరందరూ సమష్టిగా రాణిస్తే కప్ మన సొంతం అవుతుంది. 


భారత అండర్- 19 మహిళల జట్టు స్క్వాడ్


షఫాలీ వర్మ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, సౌమ్య తివారీ, గొంగడి త్రిష, రిచా ఘోష్(వికెట్ కీపర్), హృషితా బసు, టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్శవి చోప్రా, సోనమ్ యాదవ్, సొప్పదండి యశశ్రీ, ఫలక్ నాజ్, షబ్నమ్ మహమ్మద్, హర్లీ గాలా


 






ఇంగ్లండ్ తో జాగ్రత్త


అండర్- 19 టీ20 వరల్డ్ కప్ లో భారత ప్రత్యర్థి అయిన ఇంగ్లండ్ జట్టు భీకరంగా ఉంది. సూపర్- 6లో 4 మ్యాచులు గెలిచిన ఆ టీం అగ్రస్థానంతో ఫైనల్ కు చేరుకుంది. బ్యాటింగ్ లో స్క్రీవెన్స్, బౌలింగ్ లో హనా బేకర్ లు రాణిస్తున్నారు. పిచ్ కూడా ఆ జట్టుకే అనుకూలం. కాబట్టి భారత అమ్మాయిలు కప్ గెలవాలంటే తమ శక్తికి మించి ఫైనల్ లో ఇంగ్లిష్ జట్టును ఎదుర్కోవాల్సిందే.