ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ చెలరేగిపోయి సెంచరీ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. మొదట చినుకులా ప్రారంభమైన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌ తర్వాత తుపానులా మారింది. కేవలం 54 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో రుతురాజ్ శతకాన్ని బాదాడు. మొదట నిదానంగా ఆడిన రుతురాజ్ క్రీజులో కుదురుకున్నాక విధ్వంసం సృష్టించాడు.  భారీ షాట్లతో స్కోరు బోర్డుకు జెట్‌ వేగాన్నిచ్చాడు. 15 ఓవర్ల తర్వాత దొరికిన బంతిని దొరికినట్టు బాదాడు. ఏ బౌలర్‌నూ వదలకుండా ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. మూడు సిక్స్‌లు, ఫోర్‌తో హర్డీ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో 25 పరుగులు రాబట్టిన రుతురాజ్‌.. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఆఖరి ఓవర్లో మరింతగా రెచ్చిపోయాడు.


రుతురాజ్‌ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదడంతో మ్యాక్స్‌వెల్‌ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు.. మరో 20 బంతుల్లోనే సెంచరీ సాధించాడంటేనే ఎంతగా విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా 57 బంతుల్లో రుతురాజ్ 13 ఫోర్ లు, 7 సిక్స్ లతో 123 పరుగులు చేశాడు. ఈక్రమంలో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.


రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఇదే ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రుత్‌రాజ్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రెండో క్రికెటర్‌గా గైక్వాడ్‌గానూ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 126 పరుగులు చేయగా... రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇప్పుడు 123 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా రుతురాజ్‌ చరిత్రకెక్కాడు. గైక్వాడ్‌ కంటే ముందు రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, సురేష్‌ రైనా, విరాట్‌ కోహ్లి, దీపక్‌ హుడా, యశస్వీ జైశ్వాల్‌ ఉన్నారు.


ఇక  భారత్‌ వేదికగా జరుగుతున్న అయిదు మ్యాచుల టీ 20 సిరీస్‌లో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. మూడో టీ 20 మ్యాచ్‌లో  కొండంత స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. రుతురాజ్‌ మెరుపు శతకం వృథా అయింది. సీనియర్లు లేని భారత బౌలింగ్‌ లోపాలను ఎత్తిచూపుతూ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు మెరుపు ఆరంభం దొరికింది. ట్రావిస్ హెడ్, హార్డీ నాలుగు ఓవర్ లకే47 పరుగులు జోడించారు.. 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ తర్వాత వరుసగా వికెట్స్ కోల్పోయింది. కానీ మాక్స్ వెల్ ఒంటరి పోరాటం చేశాడు.. సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉన్నా క్రీజ్ లో మాక్స్ వెల్ ఉండటంతో కంగారులు చివరి ఓవర్ వరకు రేస్ లొనే ఉన్నారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (104 నాటౌట్‌, 48 బంతుల్లో 8×4, 8×6) అదరగొట్టాడు. చివరి ఓవర్ లో 21 పరుగులు అవసరంకాగా ఒక సిక్స్, మూడు ఫోర్ లతో మాక్స్ వెల్ ఆస్ట్రేలియా ను గెలిపించాడు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply