భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించిన మ్యాక్స్‌వెల్.. మరోసారి ఆ ఇన్నింగ్స్‌ను గుర్తు తెచ్చాడు. కొండంత లక్ష్యం కళ్ల ముందు ఉండగా... గెలుపు దాదాపు అసాధ్యం అనుకున్న స్థితిలో విధ్వంసకర సెంచరీతో కంగారులకు చిరస్మరణీయ విజయం అందించాడు. చివరి ఓవర్‌లో విజయం సాధించాలంటే 21 పరుగులు అవసరం కాగా.. చివరి నాలుగు బంతులను ఒక సిక్స్, మూడు ఫోర్లు బాది మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియాను గెలిపించాడు. అయితే టీమిండియా కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ చేసిన ఓ తప్పిదం ఆస్ట్రేలియాకు వరంలా కలిసొచ్చింది. ఆ తప్పు చేయకపోతే మ్యాచ్‌ భారత్‌ వైపు మొగ్గు చూపేదేమో..


19వ ఓవర్‌ అక్షర్‌ పటేల్‌ వేస్తున్నాడు.  ఆ సమయంలో ఆస్ట్రేలియా 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉన్నప్పుడు జరిగిందా ఆ తప్పిదం. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్‌ క్రీజు వదలి కాస్త ముందుకు వచ్చి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి వేడ్‌కు అందకుండా కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ చేతికి వెళ్లింది. వేగంగా స్పందించిన ఇషాన్‌ కిషన్‌... బెయిల్స్‌ను ఎగరగొట్టి అప్పీల్‌ చేశాడు. లెగ్‌ అంపైర్‌ దానిని థార్డ్‌  అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. రిప్లేలో వేడ్‌ నాటౌట్‌గా తేలింది. అయితే బంతిని అందుకునే క్రమంలో ఇషాన్‌ గ్లోవ్స్‌ స్టంప్స్‌ కన్నా ముందుకు రావడంతో అంపైర్‌ ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఇదే భారత విజయావకాశాలను దెబ్బతీసింది. ఫ్రీ హిట్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ వేడ్‌ సిక్స్‌ కొట్టాడు. అదే ఓవర్‌ ఆఖరి బంతికి బైస్‌ రూపంలో నాలుగు పరుగులు లభించాయి. దీంతో ఆస్ట్రేలియా చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వికెట్‌ కీపర్‌ స్టంప్స్‌ వెనకాలే బంతిని పట్టుకోవాలి. గ్లవ్‌లో ఏ మాత్రం స్టంప్స్‌ కన్నా ముందుకు వచ్చినా దాన్ని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించొచ్చు. ఇషాన్‌ కిషన్‌ అస్సలు అప్పీల్‌ చేయకపోతే.. ఫ్రీహిట్‌ అవకాశం వేడ్‌కు వచ్చేదే కాదు. ఆ అవకాశం రాకపోతే భారత్‌ గెలుపు అవకాశాలు పెరిగేవేమో. 


 ఇక  భారత్‌ వేదికగా జరుగుతున్న అయిదు మ్యాచుల టీ 20 సిరీస్‌లో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. మూడో టీ 20 మ్యాచ్‌లో  కొండంత స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. రుతురాజ్‌ మెరుపు శతకం వృథా అయింది. సీనియర్లు లేని భారత బౌలింగ్‌ లోపాలను ఎత్తిచూపుతూ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు మెరుపు ఆరంభం దొరికింది. ట్రావిస్ హెడ్, హార్డీ నాలుగు ఓవర్ లకే47 పరుగులు జోడించారు.. 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ తర్వాత వరుసగా వికెట్స్ కోల్పోయింది. కానీ మాక్స్ వెల్ ఒంటరి పోరాటం చేశాడు.. సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉన్నా క్రీజ్ లో మాక్స్ వెల్ ఉండటంతో కంగారులు చివరి ఓవర్ వరకు రేస్ లొనే ఉన్నారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (104 నాటౌట్‌, 48 బంతుల్లో 8×4, 8×6) అదరగొట్టాడు. చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు చేయాల్సిన స్థితిలోనూ ఆస్ట్రేలియా విజయం సాధించడం విశేషం. చివరి ఓవర్ లో 21 పరుగులు అవసరంకాగా ఒక సిక్స్, మూడు ఫోర్ లతో మాక్స్ వెల్ ఆస్ట్రేలియా ను గెలిపించాడు. భారత బౌలర్ లలో ప్రసీద్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చాడు కానీ ఒక్క వికెట్ కూడా తియ్యలేదు. రవి విష్ణోయ్ 2, హర్ష దీప సింగ్ 1, ఆవేష్ ఖాన్ 1, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు . 5 మ్యాచ్ ల సీరీస్లో టీం ఇండియా 2, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచాయి. మరో 2 మ్యాచ్ లు ఇంకా మిగిలి ఉన్నాయి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply