LSG New Coach: రెండేండ్ల క్రితం  ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన   లక్నో సూపర్ జెయింట్స్.. వరుసగా రెండు సీజన్ల పాటు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ -16లో  ఆ జట్టు సారథి కెఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలోనే నిష్క్రమించినా  కృనాల్ పాండ్యా సారథ్యంలో ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరింది.  రెండేండ్లపాటు ఆ జట్టును విజయవంతంగా నడిపించడంలో  జింబాబ్వే మాజీ  వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్   కీలక పాత్ర పోషించాడు. కానీ  వచ్చే ఏడాదిలో అతడిని పక్కనబెట్టి కొత్త కోచ్‌తో బరిలోకి దిగనుంది లక్నో టీమ్.. 


ఆస్ట్రేలియా  మాజీ ఆటగాడు, ఆ జట్టుకు  గతేడాది వరకూ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన  జస్టిన్ లాంగర్.. లక్నో హెడ్ కోచ్‌గా రానున్నాడని సమాచారం.  ఈ మేరకు లక్నో మేనేజ్‌మెంట్..  లాంగర్‌తో చర్చించినట్టు తెలుస్తున్నది. అధికారిక ప్రకటన  మాత్రమే బాకీ ఉన్నదని.. లక్నో మేనేజ్‌మెంట్ ప్రతిపాదనకు లాంగర్ ఓకే చెప్పినట్టు ఆ జట్టు వర్గాల సమాచారం.  


ప్రస్తుతానికి యాషెస్ సిరీస్‌లో భాగంగా కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న  లాంగర్.. గతంలో  ఆటగాడిగానే గాక కోచ్‌గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. అతడి  కోచింగ్ లోనే ఆస్ట్రేలియా 2021లో టీ20 వరల్డ్ కప్ నెగ్గింది.   అదే ఏడాది యాషెస్‌లో భాగంగా  స్వదేశంలో ఇంగ్లాండ్ ను 4-0తో ఓడించింది.  ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ లో లాంగర్.. పెర్త్ స్కాచర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉండి ఆ జట్టుకు మూడు టైటిల్స్ అందజేశాడు.  లాంగర్ అనుభవంతో అయినా లక్నో.. వచ్చే సీజన్‌లో ప్లేఆఫ్స్ గండం దాటి  ఫైనల్ చేరి కప్పు కొడుతుందని  ఆ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నది.  


 






హెడ్ కోచ్ కాకుండా ప్రస్తుతానికి  ఇతర కోచింగ్ స్టాఫ్ : 


- టీమ్ మెంటార్ : గౌతం గంభీర్ 
- అసిస్టెంట్ కోచ్ : విజయ్ దహియా 
- స్పిన్ బౌలింగ్ కోచ్ : ప్రవీణ్ తాంబె 
- ఫాస్ట్ బౌలింగ్ కోచ్ : మోర్నీ  మొర్కెల్ 
- ఫీల్డింగ్  కోచ్ : జాంటీ రోడ్స్


ఈ సీజన్‌లో లక్నో  టీమ్ పడుతూ లేస్తూ   ప్లేఆఫ్స్‌కు చేరింది.  ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది.  గతేడాది  కూడా   ఇదే విధంగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. 


కాగా ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత వచ్చే సీజన్ లో లక్నోతో పాటు ఇతర జట్లు కూడా   హెడ్ కోచ్‌లను మార్చనున్నట్టు సమాచారం. ఇదివరకే ఢిల్లీ క్యాపిటల్స్..  పాంటింగ్ ను పక్కనబెట్టి గంగూలీకి ఆ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్‌లు అయిన  అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్ లు ఇదివరకే  టీమ్ నుంచి తప్పుకున్నారు.   కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాఫ్‌లోనూ  మార్పులు జరిగే అవకాశమున్నట్టు సమాచారం.






















Join Us on Telegram: https://t.me/abpdesamofficial