NZ ODI WC 2023 Squad: సుమారు ఐదు నెలల తర్వాత కివీస్ సారథి కేన్ విలియమ్సన్ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ - 16లో భాగంగా గుజరాత్ - చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో గాయమై శస్త్రచికిత్స చేయించుకుని ఇన్నాళ్లూ ఆటకు దూరమైన కేన్ మామ తిరిగి జాతీయ జట్టుతో చేరాడు. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్.. వచ్చే నెలలో భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా నియమితుడైన కేన్ మామ.. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో రెండోసారి కివీస్ జట్టును నడిపించనున్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్‌ను ప్రకటించే క్రమంలో కివీస్ జట్టు వినూత్న రీతిలో వారిని పరిచయం చేసింది.
న్యూజిలాండ్ క్రికెటర్ల భార్యా పిల్లలు, తల్లిదండ్రులు తమ సంబంధీకుల పేర్లను ప్రకటించారు. ఆటగాడు, వారి జెర్సీ నెంబర్‌లను తెలుపుతూ ఒక్కో ఆటగాడిని వినూత్నంగా పరిచయం చేశారు. తొలుత కేన్ విలియమ్సన్ భార్యా పిల్లలు తర్వాత ట్రెంట్ బౌల్డ్ కొడుకులు, మార్క్ చాప్‌మన్, కాన్వే, లాకీ ఫెర్గూసన్, టామ్ లాథమ్‌లతో పాటు ఇతర ఆటగాళ్ల కుటుంబీకులు వారి పేర్లను ప్రకటించారు.
15 మంది సభ్యులతో కూడిన జట్టులో కివీస్ నలుగురు పేసర్లు, ఇద్దరు పేస్ ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. మిగిలినవారిలో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నారు. కాగా గతేడాది కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వ్యక్తిగత కారణాల రీత్యా న్యూజిలాండ్ బోర్డు కాంట్రాక్టు వదులకున్నా అతడిని ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో చేర్చారు. బౌల్ట్‌తో పాటు జేమ్స్ నీషమ్ కూడా కాంట్రాక్టు లేకున్నా వరల్డ్ కప్ జట్టులో చేరాడు. ఇక ఇంగ్లాండ్‌తో వన్డేలకు దూరమైన కైల్ జెమీసన్, ఆడమ్ మిల్నేలకు నిరాశతప్పలేదు.
ఈ ఏడాది ఐపీఎల్-16 ఆరంభంలోనే గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోబోయి బౌండరీ లైన్ వద్ద బ్యాలెన్స్ తప్పడంతో కేన్ విలియమ్సన్‌కు గాయమైంది. దీంతో చేతికర్రల సాయంతో కివీస్‌కు వెళ్లిన కేన్ మామ.. సర్జరీ చేయించుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించుకుని తిరిగి జట్టుతో చేరాడు. ఇక స్పిన్ ఆల్ రౌండర్ మైకేల్ బ్రాస్‌వెల్ గాయంతో తప్పుకోవడంతో జేమ్స్ నీషమ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. విల్ యంగ్ కు కూడా కివీస్ వరల్డ్ కప్ టీమ్‌లో చోటిచ్చింది.
వన్డే ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్డ్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాథ్యూ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial