Danish Kaneria On Jadeja:  భారత స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా లాంటి ఆల్ రౌండర్ ను ప్రపంచం చూడలేదని.. పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టిన జడేజాను ఈ పాక్ మాజీ ప్రశంసలతో ముంచెత్తాడు. 


బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్ ను చిత్తుచేసింది. ఈ విజయంలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ లో 7 వికెట్లు పడగొట్టడమే కాక 70 పరుగులతో బ్యాట్ తోనూ సత్తా చాటాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో చెలరేగాడు. తన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. 


ఏ కెప్టెన్ అయినా కావాలని కోరుకునే ఆటగాడు జడేజా


జడేజా ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. 'జడేజా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. బంతితో, బ్యాట్ తో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. అతను ప్రస్తుతం నెంబర్ వన్ ఆల్ రౌండర్. అతడిలాంటి ఆల్ రౌండర్ ను ప్రపంచ క్రికెట్ చూడలేదు. అతడు ప్రతి విభాగంపై ఆధిపత్యం చెలాయిస్తాడు. నిరంతరం ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి సృష్టిస్తాడు. ఏ కెప్టెన్ అయినా జడేజా లాంటి ఆటగాడు తన తుది జట్టులో ఉండాలని కోరుకుంటాడు.'  అని డానిష్ కనేరియా అన్నాడు. 






ఆధిపత్యం చెలాయిస్తాడు


ఈ మ్యాచ్ కు ముందు జడేజా దాదాపు 6 నెలలు గాయంతో ఆటకు దూరమయ్యాడు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఎన్ సీఏలో రిహాబిలిటేషన్ పొందాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ఎంపికైనా జడేజా ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి వచ్చింది. దీంతో రంజీల్లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు. అక్కడ విశేషంగా రాణించాడు. ఇప్పుడు ఆసీస్ తో తొలి టెస్టులోనూ ఆకట్టుకున్నాడు. జడేజా పునరాగమనంపైనా కనేరియా మట్లాడాడు. 'అతను ఫిట్ నెస్ లో ఉన్నత ప్రమాణాలను కొనసాగిస్తాడు. దాదాపు 6 నెలలు క్రికెట్ ఆడలేదు. అయినప్పటికీ తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకున్నాడు. తిరిగి రావడమనేది అంత సులభం కాదు. అదీ ఆస్ట్రేలియా వంటి జట్టుపై. అలాంటిది జడేజా అద్భుతమే చేశాడు. పెద్ద జట్టుతో జరిగిన తన పునరాగమన మ్యాచ్ లో జడేజా పూర్తి  ఆధిపత్యం ప్రదర్శించాడు.' అని అన్నాడు. 


భారత్- ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 14 నుంచి దిల్లీ వేదికగా ప్రారంభం కానుంది.