Asia Cup 2023:  టీమిండియా  వెటరన్ బ్యాటర్  కెఎల్ రాహుల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.  జిడ్డు బ్యాటింగ్, పేలవ ఫామ్‌తో ఈ ఏడాది మార్చిలో అతడి పేరు చెబితేనే అగ్గిమీద గుగ్గిళ్లంలా మండిపోయే భారత క్రికెట్ అభిమానులు, విమర్శకులు సైతం ‘వహ్వా రాహుల్’ అంటూ  ప్రశంసలు కురిపించారు. పక్కా సాంప్రదాయక వన్డే ఇన్నింగ్స్ ఆడిన రాహుల్‌ సెంచరీ  తర్వాత అతడి భార్య అతియా శెట్టి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించింది. నిశిరాత్రికి కూడా  ముగింపు ఉంటుందని వాటికి సూర్యోదయం కూడా తప్పక వస్తుందని రాహుల్ ఫామ్‌ను ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది. 


పాక్‌తో మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ చేసిన తర్వాత అతియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో  స్పందిస్తూ.. ‘నిశిరాత్రికి కూడా ముగింపు ఉంటుంది. సూర్యోదయం తప్పకవస్తుంది.   నువ్వే నాకు సర్వస్వం. ఐ లవ్ యూ’ అంటూ  రాహుల్ ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేసింది.   రాహుల్ సెంచరీ  చేసినప్పుడు  చేసుకున్న సెలబ్రేషన్స్,  అతడి స్కోరు కార్డుకు సంబంధించిన స్క్రీన్  షాట్స్‌ను అందులో ఉంచింది.  ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 


 






కాగా గత కొన్నాళ్లుగా విఫలమవుతున్న  రాహుల్‌ను ఈ ఏడాది ఆస్ట్రేలియాతో  టెస్టు సిరీస్‌లో ఎంపిక చేసినా అతడు విఫలమయ్యాడు. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులలో వైఫల్యంతో  అతడిని  బోపాల్ టెస్టులో ఎంపిక చేయలేదు. అహ్మదాబాద్‌లో కూడా అతడికి చోటు దక్కలేదు. కానీ వన్డేలలో మాత్రం రాహుల్ భారత్‌కు ఆపద్బాంధవుడయ్యాడు. అయితే  ఆ తర్వాత  ఐపీఎల్ ఆడిన రాహుల్.. ఈ మెగా టోర్నీలో కూడా  అంత గొప్పగా రాణించలేదు.  ఈ క్రమంలో రాహుల్‌కు భారత జట్టు  నుంచి ఉద్వాసన పలకాలని  డిమాండ్లు వినిపించాయి.  ఇక మే లో ఐపీఎల్‌లో ఆర్సీబీతో మ్యాచ్ ఆడుతూ  అతడు గాయపడ్డాడు.  అదేనెలలో శస్త్రచికిత్స చేయించుకున్న రాహుల్..  సుమారు  రెండు నెలల పాటు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనే గడిపాడు. 


 






 






ఆసియా కప్‌లో అతడిని ఎంపిక చేయడం.. వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించడంతో   రాహుల్ పైనే గాక సెలక్షన్ కమిటీ పైనా విమర్శలు వెల్లువెత్తాయి.  ఫామ్‌లో లేని ఆటగాడిని ఎలా ఎంపికచేస్తారని ఫ్యాన్స్ మండిపడ్డారు.  ఆసియా కప్ ప్రారంభానికి ముందే  ఫిట్‌నెస్ నిరూపించుకోక  రెండు మ్యాచ్‌లకు దూరమైన రాహుల్.. రీఎంట్రీలో  విమర్శకుల నోళ్లు మూయించే ఇన్నింగ్స్ ఆడాడు.   పాకిస్తాన్‌తో పోరులో 106 బంతుల్లో 111 పరుగులు చేసిన రాహుల్.. వరల్డ్ కప్‌లో నెంబర్ ఫోర్ ప్లేస్ తనదేనని చెప్పకనే చెప్పాడు. 











ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial