Asia Cup 2023: ఈ ఏడాది జూన్ నుంచి వన్డేలలో ఓటమెరుగని జట్టుగా ఉన్న శ్రీలంకకు ఆసియా కప్‌లో భారత్ ఓటమి రుచి చూపించింది. వరుసగా 13 వన్డేలు గెలిచిన శ్రీలంకను ఓడించి ఆసియా కప్ - 2023లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. శ్రీలంక స్పిన్నర్లు రాణించి భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా ఆ తర్వాత లంక బ్యాటర్ల వైఫల్యంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, బౌలింగ్‌లో స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌లు రాణించి భారత్‌ను లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో గెలుపు అందుకుంది.
భారత్‌తో సూపర్ - 4 మ్యాచ్‌కు ముందు లంక గత మూడు నెలలుగా వన్డేలలో ఓటమెరుగని జట్టుగా బరిలోకి దిగింది. 2023 జూన్ నుంచి మొన్న బంగ్లాదేశ్‌తో ఆడిన 13 వన్డేలలో ఓటమనేదే లేకుండా సాగింది ఆ జట్టు జైత్రయాత్ర. అఫ్గాన్, యూఏఈ, ఓమన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లపై ఆ జట్టు విజయాలు సాధించింది. భారత్‌తో పోరులోనూ ఆ జట్టు విజయం సాధించే అవకాశాలు ఉన్నా వాటిని వృథా చేసుకుంది.
వెల్లలాగే ఆల్ రౌండ్ షో..
భారత్ - పాక్ మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించిన 15 గంటలలోనే తిరిగి మ్యాచ్ ఆడిన రోహిత్ సేన లంకను కూడా ఈజీగా దాటుతుందనే అనుకున్నారు అభిమానులు. భారత ఇన్నింగ్స్ కూడా ఘనంగానే మొదలైంది. 11 ఓవర్లకు భారత స్కోరు వికెట్ నష్టపోకుండా 80 పరుగులతో దూసుకుపోతున్న క్రమంలో లంక సారథి దసున్ శనక.. యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను బరిలోకి దింపాడు. ఆ ఓవర్లో గిల్‌ను ఔట్ చేసిన వెల్లలాగే ఆ తర్వాత వరుస ఓవర్లలో కోహ్లీ, రోహిత్‌ను ఔట్ చేశాడు. మ్యాచ్‌ను శాసించే స్థితిలో ఉన్న భారత్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. ఇషాన్ - రాహుల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా ఆ తర్వాత అతడు కెఎల్‌ను కూడా ఔట్ చేశాడు. అతడికి తోడుగా చరిత్ అసలంక కూడా విజృంభించడంతో భారత్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడింది. వన్డే చరిత్రలో తొలిసారిగా భారత్ పది వికెట్లు స్పిన్నర్లకే కోల్పోయింది. వెల్లలాగే ఐదు వికెట్లు తీయగా అసలంక నాలుగు, తీక్షణ ఒక వికెట్ పడగొట్టాడు.
ఆ తర్వాత భారత్ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నా వెల్లలాగే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా టీమిండియాను భయపెట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 46 బంతుల్లోనే 3 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. లంక జట్టులో అతడే టాప్ స్కోరర్. ఆరో వికెట్‌కు ధనంజయ డి సిల్వతో కలిసి 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత స్పిన్నర్లతో పాటు పేసర్లను కూడా వెల్లలాగే సమర్థంగా ఎదుర్కున్నాడు.
కుల్‌దీప్ మళ్లీ..
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన కుల్‌దీప్ లంకతో కూడా రెచ్చిపోయాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై భారత పేసర్లు బుమ్రా రెండు వికెట్లు, సిరాజ్ ఒక్క వికెట్ తీయగా కుల్‌దీప్ మరోసారి నాలుగు వికెట్లతో చెలరేగాడు. లంక కీలక బ్యాటర్లు సమరవిక్రమ, చరిత్ అసలంకలతో పాటు లోయరార్డర్‌లో కసున్ రజిత, పతిరానలను ఔట్ చేశాడు. మిడిల్ ఓవర్స్‌లో జడేజా కూడా లంకను కట్టడి చేయడమే గాక కెప్టెన్ శనక, ధనంజయ డి సిల్వ వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు.
భారత్ ఫైనల్‌కు..
ఈ విజయంతో భారత్ ఆసియా కప్ - 2023లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేని జట్టు కూడా భారత్ ఒక్కటే. భారత్ విజయంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. కాగా భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 15న బంగ్లాదేశ్‌తోనే ఆడనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial