శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది.


భారత్ తరఫున అర్థ సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (42: 46 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక పరుగులు సాధించాడు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.


ప్రారంభించిన పేస్... చుట్టేసిన స్పిన్...
214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. కేవలం 25 పరుగులే శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ ఆరంభం నుంచే నిప్పులు చెరిగారు. పతుం నిశ్శంకను (6: 7 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేసి సిరాజ్ భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. దిముత్ కరుణరత్నే (2: 18 బంతుల్లో), కుశాల్ మెండిస్‌లను (15: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుట్ చేసి బుమ్రా లంకను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.


సదీర సమరవిక్రమ (17: 31 బంతుల్లో, ఒక ఫోర్), చరిత్ అసలంక (22: 35 బంతుల్లో, రెండు ఫోర్లు) శ్రీలంక ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్లు బరిలోకి దిగాక పరిస్థితి మారిపోయింది. క్రీజులో కుదురుకున్న సదీర సమరవిక్రమ, చరిత్ అసలంకలను కుల్దీప్ యాదవ్ తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కెప్టెన్ దసున్ షనకను రవీంద్ర జడేజా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో శ్రీలంక 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. భారత్ విజయం సాధించేలా కనిపించింది.


కానీ ధనుంజయ డిసిల్వ (41: 66 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), దునిత్ వెల్లలాగే (42: 46 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. కొట్టాల్సిన స్కోరు తక్కువే కావడంతో ఎక్కువ తొందరపడకుండా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. దునిత్ వెల్లలాగే సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్‌ను రొటేట్ చేశారు. వీరు ఏడో వికెట్‌కు ఏకంగా 63 పరుగులు జోడించారు. ఈ జోడి ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ధనంజయ డిసిల్వను అవుట్ చేసి రవీంద్ర జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇక ఆ తర్వాత శ్రీలంక ఆలౌట్ అవ్వడానికి ఎక్కువ సేపు పట్టలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.


తక్కువ స్కోరుకే పరిమితం అయిన భారత్
అంతకు ముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియాకు శుభారంభం దక్కింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) తొలి ఓవర్‌ నుంచే వేగంగా ఆడటం ప్రారంభించాడు. రోహిత్‌కు శుభ్‌మన్‌ గిల్‌ (19: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) అండగా నిలిచాడు. 44 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.


దునిత్ వెల్లెలాగె వేసిన 12వ ఓవర్లో శుభ్‌మన్ బౌల్డ్‌ అవ్వడంతో 80 పరుగుల తొలి భాగస్వామ్యానికి తెరపడింది. మరో 10 పరుగులకే విరాట్‌ కోహ్లీ (3: 12 బంతుల్లో), 16వ ఓవర్లో రోహిత్‌ శర్మ కూడా వెల్లెలాగె బౌలింగ్‌లోనూ ఔటవ్వడంతో టాప్‌ ఆర్డర్‌ పని ముగిసింది.


కేఎల్‌ రాహుల్‌ (39: 44 బంతుల్లో, రెండు ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (33: 61 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అద్భుత పోరాటాన్ని ప్రదర్శించారు. వీరు మొదట వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 89 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అర్థ శతకం వైపు సాగుతున్న కేఎల్‌ రాహుల్‌ను జట్టు స్కోరు 154 వద్ద వెల్లెలాగేనే పెవిలియన్‌ బాట పట్టించాడు.


అక్కడి నుంచి చరిత్‌ అసలంక లంక బౌలింగ్‌ అటాక్‌ను నడిపించాడు. జట్టు స్కోరు 170 వద్ద ఇషాన్ కిషన్‌ను ఔట్‌ చేశాడు. రవీంద్ర జడేజా (4: 19 బంతుల్లో), బుమ్రా (5: 12 బంతుల్లో), కుల్‌దీప్‌ యాదవ్‌‌లను (0: 1 బంతి) స్వల్ప స్కోర్లకే ఔట్‌ చేశాడు. అంతకు ముందే హార్దిక్ పాండ్యా (5: 18 బంతుల్లో)ను వెల్లెలాగె పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (26; 36 బంతుల్లో, ఒక సిక్సర్) పోరాడటంతో భారత్ స్కోరు 213 పరుగులకు ఆలౌట్ అయింది.