ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మరోసారి భారీ స్కోరు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్‌ బౌలర్లను ఊచకోత కోసిన ప్రొటీస్‌ బ్యాటర్లు మరోసారి స్కోరు బోర్డును  పరుగులు దాటించారు. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేశారు. క్లాసెన్‌, జాన్సన్‌ మెరుపు బ్యాటింగ్‌తో ప్రొటీస్‌ స్కోరు బోర్డును పరుగు పెట్టించారు. సెమీస్‌ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమైన దశలో సఫారీ బ్యాటర్లు సత్తా చాటారు. క్లాసెన్‌ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 67 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్‌ 12 ఫోర్లు, 4 సిక్సులతో 109 పరుగులు చేసి అవుటయ్యాడు. క్లాసెన్‌కు తోడు జాన్సన్‌ కూడా చివరి పది ఓవర్లలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 42 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్‌ 3 ఫోర్లు, ఆరు సిక్సులతో 75 పరుగులు చేశాడు. క్లాసెన్‌తో పాటు చివర్లో జాన్సన్‌ మెరుపులు మెరిపించడంతో దక్షిణాఫ్రికా ఈ ప్రపంచకప్‌లో మరోసారి భారీ స్కోరు చేసింది. జాన్సన్ 42 బంతుల్లో 75 పరుగులు చేశాడు. క్లాసెన్‌ అద్భుత శతకానికి తోడు హెన్డ్రిక్స్‌  85 పరుగులు, వాన్‌డెర్‌ డస్సెన్‌ 60, మార్‌క్రమ్‌ 42, రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 399 పరుగులు చేసింది.

 

వచ్చిన సఫారీ బ్యాటర్లందరూ తమ వంతు పాత్ర సమర్థంగా నిర్వహించడంతో ప్రొటీస్‌ ఈ ప్రపంచకప్‌లో మరోసారి భారీ స్కోరు సాధించింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌..దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అలా వచ్చి రాగానే ఓపెనర్‌ క్వింటన్ డికాక్‌.. తోప్లే వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్‌ కొట్టాడు. కానీ కానీ తర్వాతి బంతికే కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. స్కోరు బోర్డు మీద నాలుగు పరుగులు చేరాయో లేదో డికాక్‌ పెవిలియన్‌ చేరాడు. కానీ ఈ ఆనందం ఇంగ్లాండ్‌కు ఎక్కువసేపు నిలువలేదు. మరో ఓపెనర్‌ హెన్రిక్స్‌తో కలిసి వాన్‌డేర్‌ డస్సెన్‌ ప్రొటీస్‌కు మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు.  బ్రిటీష్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఇద్దరు దక్షిణాఫ్రికా స్కోరు బోర్డును పరిగెత్తించారు. రెండో వికెట్‌కు హెన్రిక్స్‌-వాన్‌డేర్‌ డస్సెన్‌ జోడి 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.

 

ప్రమాదకరంగా మారుతున్న హెన్రిక్స్‌-హెన్రిక్స్‌-వాన్‌డేర్‌ డస్సెన్‌ జోడి జోడిని అదిల్‌ రషీద్‌ విడదీశాడు. 61 బంతుల్లో 60 పరుగులు చేసిన వాన్‌డేర్‌ డస్సెన్‌ను రషీద్‌ అవుట్‌ చేశాడు. 125 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. డస్సెన్‌ అవుటైనా హెన్ర్డిక్స్‌ రాణించాడు. కానీ 85 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న రీజా హెన్డ్రిక్స్‌ను రషీద్‌ బౌల్డ్‌ చేశాడు. 164 పరుగుల వద్ద ప్రొటీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. వరుసగా వికెట్లు కోల్పోతున్నా దక్షిణాఫ్రికా బ్యాటర్లు తమ వంతు పాత్ర పోషించారు. మార్‌క్రమ్‌ 42 పరుగులు చేసి తోప్లే బౌలింగ్‌లో అవుటయ్యాడు. డేవిడ్‌ మిల్లర్‌ అయిదు పరుగులకే వెనుదిరగడంతో ప్రొటీస్‌ అయిదో వికెట్‌ను కోల్పోయింది.  కానీ క్లాసెన్‌... మార్కో జాన్సన్‌ చివరి పది ఓవర్లలో దక్షిణాఫ్రికాకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరి బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.  ఇంగ్లాండ్‌ బౌలర్లలో తోప్లే 3, అదిల్ రషీద్‌ రెండు వికెట్లు తీశారు.

 

స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ తిరిగి జట్టులో చేరడంతో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ కూడా పటిష్టంగా మారింది. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండడంతో ఈ మ్యాచ్‌లో లక్ష్య చేధన సాధ్యమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న బ్రిటీష్‌ జట్టు ప్రపంచకప్‌లో అత్యధిక లక్ష్యాన్ని చేధిస్తుందేమో చూడాలి. కానీ దక్షిణాఫ్రికా బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. కగిసో రబడ (7 వికెట్లు) మార్కో జాన్సెన్ (6 వికెట్లు) ఫామ్‌లో ఉన్నారు. లుంగీ ఎంగిడి (4 వికెట్లు) సాధించి పర్వాలేదనిపిస్తున్నాడు.

 

దక్షిణాఫ్రికా- ఇంగ్లాండ్‌ జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా ఏడు మ్యాచ్‌లు తలపడగా... బ్రిటీష్‌ జట్టు నాలుగు మ్యాచుల్లో... సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌లు గెలుపొందాయి.