Alex Hales Retirement: గతేడాది  టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత్‌ను పది వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ టీమ్‌లో ఇండియా బౌలింగ్‌‌ను ఆటాడుకున్న ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ గుర్తున్నాడా..?  ఈ స్టార్ ఓపెనర్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  అంతర్జాతీయ  క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు  ప్రకటించాడు.  ఈ మేరకు ఇంగ్లాండ్  అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.  34 ఏండ్ల హేల్స్.. ఇంగ్లాండ్ తరఫున  అన్ని ఫార్మాట్లలో కలిసి 156 మ్యాచ్‌లు ఆడాడు.  


2011లో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ ఎంట్రీ ఇచ్చిన హేల్స్.. 2015లో టెస్టులలో,  2014లో వన్డేలలో అరంగేట్రం చేశాడు.  హేల్స్ తన కెరీర్‌లో ఇంగ్లాండ్ తరఫున 11 టెస్టులు,  70 వన్డేలు,  75 టీ20లు ఆడాడు. టెస్టులలో 573 పరుగులు చేసిన హేల్స్.. వన్డేలలో 2,419 రన్స్, టీ20‌లలో 2,074 పరుగులు సాధించాడు.  వన్డేలలో ఆరు సెంచరీలు చేసిన అతడు.. టీ20 లలో ఒక సెంచరీ, 12 అర్థ సెంచరీలు కూడా చేశాడు. ఇంగ్లాండ్ తరఫున టీ20లలో తొలి సెంచరీ చేసిన (2014లో శ్రీలంక మీద) రికార్డు హేల్స్ పేరుమీదే ఉంది. వన్డేలలో కూడా ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (పాకిస్తాన్‌పై 122 బంతుల్లో 171)  సాధించిన రికార్డు కూడా అతడిదే.. 


హేల్స్ చివరిసారిగా  టీ20 వరల్డ్ కప్‌ - 2022లో భాగంగా ఫైనల్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడాడు.  సెమీస్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో  86 పరుగులు చేసి భారత్‌కు కోలుకోలేని షాకిచ్చాడు. ఆ మ్యాచ్‌లో హేల్స్‌కు తోడు కెప్టెన్ జోస్ బట్లర్ కూడా రాణించడంతో ఇంగ్లాండ్.. భారత్ పై పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 


 






ఫ్రాంచైజీల కోసమేనా..? 


ఉన్నట్టుండి హేల్స్ రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక  కారణం లేకపోలేదు.  దూకుడుగా ఆడుతూ టీ20లకు ఉపయోగపడే ఆటతో విరుచుకుపడే హేల్స్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌లో మంచి  గిరాకీ ఉంది.  గతేడాది ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఐదు టీ20లు ఆడేందుకు వెళ్లగా  హేల్స్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్   లో కాంట్రాక్టు ఉండటంతో ఆ టూర్‌కు వెళ్లలేకపోయాడు.  ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున  (2018) ఆడిన హేల్స్.. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్‌లో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్, వెస్టిండీస్‌లో జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లాండ్‌లోనే జరిగే ది హండ్రెడ్ వంటి లీగ్స్‌లలో ఆడుతున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల వల్ల  ఫ్రాంచైజీ  కాంట్రాక్టులు కోల్పోతున్నాననే కారణంగానే  హేల్స్.. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.


 






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial