Ishan Kishan: వెస్టిండీస్‌తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో ఆగంగా ఆడిన మూడు వన్డేలలోనూ అర్థ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్‌కు వన్డేలలో డబుల్ సెంచరీ కూడా ఉంది. గతేడాది బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా అతడు మూడో వన్డేలో డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరఫున డబుల్ సెంచరీ చేసిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇషాన్. ఇంత చేసినా అతడికి జట్టులో ఇంకా తన స్థానంపై గ్యారెంటీ లేదు. తాజాగా పాకిస్తాన్ మాజీ సారథి సల్మాన్ భట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ద్విశతకం చేశాక కూడా భారత జట్టు ఇషాన్‌ను సరిగా వినియోగించుకోవడం లేదని వ్యాఖ్యానించాడు.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సల్మాన్ భట్ మాట్లాడుతూ.. ‘ఇషాన్ కిషన్ విషయంలో భారత జట్టు చేస్తున్న ప్రయోగాలు అయోమయానికి గురి చేస్తున్నాయి. డబుల్ సెంచరీ సాధించిన తర్వాత కూడా అతడిని బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. వన్డేలలో ద్విశతకం చేసినా అతడు భారత జట్టులో రెండో ఆప్షన్‌గానే ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేసినా కూడా ఇషాన్ పరిస్థితి అదే.. అతడు ఎప్పుడూ బెస్ట్ ప్లేయర్ అని వాళ్ల (టీమ్ మేనేజ్మెంట్)కు అనిపించదు. అతడి ప్రదర్శనకు తగిన ప్రతిఫలం దక్కలేదు. ప్రస్తుతం అయితే అతడు ఎంత భాగా ఆడినా అతడు సెకండ్ ఆప్షన్ గానే ఉన్నాడు...’ అని చెప్పాడు.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీ చేశాక ఇషాన్‌కు స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తగినన్ని అవకాశాలు రాలేదు. కానీ వెస్టిండీస్ పర్యటనలో రోహిత్ శర్మ తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా ఇషాన్ ఓపెనింగ్‌కు వచ్చాడు. 2,3 వన్డేలలో రోహిత్ ఆడకపోవడంతో ఇషాన్‌నే ఓపెనర్‌గా వచ్చాడు. అయితే మళ్లీ రోహిత్ తిరిగి వచ్చాక ఇషాన్ మిడిలార్డర్‌కు పరిమితం అవ్వాల్సిందే. అది కూడా జట్టులో చోటు దక్కితేనే..
కాగా రోహిత్ తిరిగి జట్టుతో చేరితే అతడు శుభ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్‌కు వస్తాడు. మూడో స్థానంలో కోహ్లీ, నాలుగులో సూర్యకుమార్ యాదవ్ లేదా సంజూ శాంసన్ ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. ఐదో స్థానంలో హార్ధిక్ పాండ్యా వస్గే ఆ తర్వాత ప్లేస్‌లో ఇషాన్ రావాల్సి ఉంటుంది. రిషభ్ పంత్ స్థానాన్ని ఇషాన్‌తో భర్తీ చేయాల్సి వస్తుంది. అయితే ఆసియా కప్ వరకు కెఎల్ రాహుల్ ఫిట్ అవుతాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే రాహుల్‌తో వికెట్ కీపింగ్ చేయించి మరో బౌలర్‌ను తీసుకునేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపొచ్చు. ఎటొచ్చీ ఇషాన్‌కు తిప్పలు తప్పేలా లేవు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial