India vs South Africa Test Series: సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారీ శతకంతో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన డీన్‌ ఎల్గర్‌ (Dean Elgar)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎల్గర్ వీడ్కోలు పలకనున్నాడు. ఇప్పటికే ప్రొటీస్‌ కెప్టెన్‌ బవుమా గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరం కావడంతో.. అతని స్థానంలో ఎల్గర్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్‌ (South Africa Captain Dean Elgar)గా వ్యవహరించనున్నాడు.  దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌కు తన కెరీర్‌ ఆఖరి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. కెప్టెన్‌ తెంబా బవుమా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో క్రికెట్‌ దక్షిణాఫ్రికా.. సారథ్య బాధ్యతలను ఎల్గర్‌కు అప్పగించింది. బవుమా స్థానంలో జుబేర్‌ హంజాను జట్టుకు ఎంపిక చేసింది. భారత్‌తో సిరీస్‌తో రిటైరవుతున్నట్లు ఎల్గర్‌ ముందే ప్రకటించాడు. గాయంతో బవుమా మైదానాన్ని వీడడంతో తొలి టెస్టులోనూ ఎల్గర్‌ సారథిగా వ్యవహరించాడు.  


జనవరి మూడో తేదీ నుంచి భారత్‌తో జరిగే రెండో టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ బవుమా గాయంతో దూరమయ్యాడు. తొలి టెస్టు తొలి రోజే ఫీల్డింగ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో బవుమా మైదానం వీడాడు. రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న ఎల్గర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. భారత జట్టు 2021-22లో దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ఎల్గర్‌ కెప్టెన్సీలోనే 2-1తో సిరీస్‌ గెలిచింది.


తొలి టెస్టులో ఘన విజయం
ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో245 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ మినహా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, కఠిన సవాళ్లను ఎదుర్కొని కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకంతో టీమిండియాకు గౌరవప్రమదమైన స్కోరు అందించాడు. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో టాప్‌ఆర్డర్‌ విఫలమవడంతో జట్టు 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రాహుల్‌.. జట్టుకు పోరాడే స్కోరు అందించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ప్రొటీస్‌ను ఎల్గర్‌ భారీ స్కోరు దిశగా నడిపించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్గర్‌ ఇచ్చిన క్యాచ్‌ చేజారింది. 79 ఓవర్లకు భారత్‌ స్కోరు 300 పరుగులు దాటింది. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 88వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన జాన్సన్‌ అర్ధ శతకం సాధించాడు. కెరీర్‌లో అతడికిది రెండో అర్ధ శతకం కావడం గమానార్హం. చాలాసేపటి తర్వాత ఎట్టకేలకు భారత్‌కు ఉపశమనం లభించింది. 94.5వ ఓవర్లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో షార్ట్‌ పిచ్‌ బంతిని ఆడబోయిన ఎల్గర్‌ వికెట్‌ కీపర్‌కు దొరికిపోయాడు. భారీ శతకంతో ఇన్నింగ్స్‌ను నిర్మించిన డీన్‌ ఎల్గర్‌ 185 పరుగులు చేసి ఔటయ్యాడు. డీర్‌ఎస్‌కు వెళ్లినా సఫారీ జట్టుకు ఫలితం అనుకూలంగా రాలేదు. ఆరో వికెట్‌కు ఎల్గర్‌-జాన్‌సెన్‌ 111 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. బవుమా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో సౌతాఫ్రికా ఆలౌటైనట్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం సంపాదించింది.


అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (76) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శుభ్‌మన్ గిల్ 26 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నండ్రీ బర్గర్‌ 4, మార్కో జాన్‌సెన్ 3, రబాడ 2 వికెట్లు తీశారు.